
హక్కుల పరిరక్షణలో ఓంకార్ పాత్ర ఎనలేనిది
● మోదీ పాలన దేశానికే ప్రమాదకరం
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
వరంగల్ చౌరస్తా: పౌర హక్కులు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే ఓంకార్ చేసిన ఉద్యమాలు, త్యాగాలు ఎనలేనివని పలువురు వక్తలు తెలిపారు. వరంగల్ అండర్ బ్రిడ్జికి సమీపంలోని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణలో ఆయన పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పెదారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, నాయకులు నున్నా అప్పరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతుందని ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారన్నాని అన్నారు. అడవిలోని ఆదివాసీలను కాల్చి చంపుతూ.. అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నర్ర ప్రతాప్, కుసుంబ బాబురావు, జగదీశ్వర్, నలిగంటి చంద్రమౌళి, రాజన్న, అనిత, ఇస్మాయిల్ పాల్గొన్నారు.