
తడి, పొడి పద్ధతుల్లో విత్తన శుద్ధి చేసుకోవాలి
గూడూరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా వరిలో తడి లేదా పొడి పద్ధతుల్లో విత్తనశుద్ధ్ది చేసుకోవాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నా రు. గూడూరు, గాజులగట్టు గ్రామాల్లో శుక్రవారం వరి, పత్తి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో తడి పద్ధతిలో లీటరు నీటికి 3గ్రాముల కార్బండిజమ్ కలిపిన నీటిలో కిలో విత్తనాలను 12 నుంచి 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత విత్తుకోవాలని సూచించారు. పొడి పద్ధతిలో కిలో విత్తనాలకు 1గ్రాము కార్బండిజమ్ కలిసి నేరుగా నారుమడిలో చల్లుకోవచ్చని తెలిపారు. వానాకాలం మొక్కజొన్న పంటను బోదె సాళ్ల పద్ధతిలో వేసుకోవాలని, దీంతో అధిక వర్షాలు కురిస్తే పంట ముంపునకు గురికాకుండా ఉంటుందన్నారు. యూరియాను మోతాదుకు మించి వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్ మాలిక్, ఏఈఓ మధు, రైతులు పాల్గొన్నారు.