
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తొర్రూరు: అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 72 మంది లబ్ధిదారులకు రూ.72.8 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బిడ్డల వివాహాలకు ప్రభుత్వం సాయం అందించి అండగా నిలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనివి కాంగ్రెస్ ప్రభుత్వం 18 మాసాల్లో చేసి చూపుతుందన్నారు. పేదలకు అండగా రేవంత్‌రెడ్డి సర్కారు నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, స్థానిక నాయకులు గంజి విజయ్‌పాల్‌రెడ్డి, ముద్దం విక్రమ్‌రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, వెన్నం సోమిరెడ్డి, మిత్తింటి హరీశ్, మొగుళ్ల లింగన్న, మహబూబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి