ఎమ్మెల్యే మావోడే..! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మావోడే..!

Jun 27 2025 12:32 PM | Updated on Jun 27 2025 12:32 PM

ఎమ్మెల్యే మావోడే..!

ఎమ్మెల్యే మావోడే..!

సాక్షి, మహబూబాబాద్‌: ఎమ్మెల్యే మా బాబాయ్‌.. మా బావ.. మా అన్న.. మాకు దగ్గరి బంధువు.. ఆ యన కుటుంబంతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌ పేరుతో పలు దందాలు చేస్తున్నారు. ఈ విషయం ఆనోట..ఈనోట ఎమ్మెల్యే వరకు చేరింది. దీంతో ఆయన ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన పేరు వాడుకొని దందాలు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

మండలానికో షాడో ఎమ్మెల్యే..

మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని మహబూ బాబాద్‌ పట్టణం, మహబూబాబాద్‌, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే పేరుతో పలువురు నాయకులు అక్రమ మార్గంలో దందాలు చేస్తూ పార్టీకి, ఆయనకు చెడ్డపేరు తెస్తున్నారని గతంలో విమర్శలు వచ్చాయి. కాగా మండలాల్లో కొందరు తాము షాడో ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ దందాలు చేస్తున్నారు. తాము చెప్పిందే వేదం అనే స్థాయికి చేరినట్లు సమాచారం. కాగా వారు పార్టీకి కార్యకర్తలను దూరం చేస్తున్నట్లు పలువురు ముఖ్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహం..

తన పేరు చెప్పి అక్రమ దందాలు, డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే మండలాలు, మహబూబాబాద్‌ పట్టణంలో తన పేరు చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని కొందరు అధికారులు కూడా ఎమ్మెల్యేకు తెలిపినట్లు సమాచారం. అలాగే ముఖ్యకార్యకర్తల ఎదుట వాపోయి నట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కొందరికి ఫోన్‌చేసి మందలించడంతో పాటు మరికొందరిని హెచ్చరించినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎవరైనా తన పేరు వాడుకొని దందాలు చేస్తే నేరుగా చెప్పండి అంటూ ఎమ్మెల్యే టోల్‌ ఫ్రీ నంబర్‌ కూడా ప్రకటించడం గమనార్హం.

పైరవీలు.. దందాలు..

ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలు చూపించడం, ఎమ్మెల్యే ఫోన్‌లో చనువుగా మాట్లాడిన తీరును రికార్డు చేసి వినిపించి పలువురు పైరవీలకు తెరతీసినట్లు ప్రచారం.

కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని పలువురు కాంగ్రెస్‌ నాయకులు డబ్బులు వసూలు చేశారు. తీరా లబ్ధిదారుల తుది జాబితాలో సదరు వ్యక్తి పేరు లేకపోవడంతో పైరవీ చేసిన నాయకుడితో గొడవ పడినట్లు తెలిసింది.

మహబూబాబాద్‌, కేసముద్రం మండలాల్లో రాజీవ్‌ యువ వికాసం డబ్బులు ఇప్పిస్తామని, ముందుగా కొంత మేరకు ముట్టచెప్పాలని వసూలు చేసినట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇచ్చిన వాళ్లు రూ.లక్షపైగా రుణాలకు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకే ఇస్తారని ప్రచారం జరగడంతో పైరవీ చేసిన వ్యక్తి చేతులు ఎత్తేసినట్లు ఆయా మండలాల్లో ప్రచారం జరిగింది.

నెల్లికుదురు మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారితో ఓ నాయకుడు చేతులు కలిపి ఎమ్మెల్యే పేరు అధికారుల ఎదుట వాడుకున్నట్లు ప్రచారం. తమకు నచ్చిన వారి ట్రాక్టర్లే నడవాలని, లేకపోతే కేసులు పెట్టాల ని, అంతా ఎమ్మెల్యే చూసుకుంటారని సదరు నాయకుడు స్థానిక అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.

మహబూబాబాద్‌ పట్టణంలో పలువురు నాయకులు తమ బినామీల పేర్లతో ట్రాక్టర్లు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేసి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతోంది.

మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో డోర్‌ నంబర్లు ఇప్పిస్తామని కొందరు పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయంపై కాంగ్రెస్‌ పార్టీలో చర్చగా మారింది.

మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరుతో దందాలు

అధికారుల ముందు శాసనసభ్యుడి

పేరు చెప్పి బెదిరింపులు

రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ

ఇళ్లు ఇప్పిస్తామని డబ్బుల వసూలు

మున్సిపాలిటీలో డోర్‌ నంబర్లు

ఇప్పిస్తామని పేదలకు ఆశ

ఎమ్మెల్యే వరకు వెళ్లిన వ్యవహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement