
ప్రాణాలతో చెలగాటం
కొత్తగూడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల. ఆ కలను సాకారం చేసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగంలో చేరిన విద్యుత్‌శాఖ ఉద్యోగులు మాత్రం ఇటీవల జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను చూసి వణికిపోతున్నారు. గంగారం మండలంలో బుధవారం జేఎల్‌ఎం చిలుక ప్రవీణ్(25) విద్యుదాఘాతంతో మృతి చెందడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎల్‌సీ తీసుకున్నప్పటికీ విద్యుత్‌షాక్ తగిలి మృతి చెందడం ఏంటని, తమ పరిస్థితి ఏమిటని తర్జనభర్జన పడుతున్నారు.
వేసవిలో గాలిదుమారం,
వానాకాలంలో వర్షాలతో..
ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ లైన్లు అడవి మార్గాన కిలోమీటర్ల మేర వెళ్తున్నాయి. దీంతో ఎండాకాలం గాలి దుమారాలు, వానాకాలంలో వర్షాలతో చెట్లు, కొమ్మల వల్ల తీగలు తెగడం, విద్యుత్ స్తంభాల కాసారాలు పగిలిపోతుంటాయి. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుంది. వీటిని సరిచేసేందుకు విద్యుత్ సిబ్బంది రాత్రినక, పగలనక అడవుల్లో తిరగాల్సి వస్తోంది. అనుమానం వచ్చిన స్తంభం పైకి ఎక్కి పరిశీలిస్తుంటారు. ఈక్రమంలో ఎల్‌సీ తీసుకున్నప్పటికీ ఒక్కోసారి వివిధ కారణాల వల్ల విద్యుత్ సరఫరా అయి ప్రాణాల మీదకు వస్తుంది. గత సంవత్సరం ఓటాయి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి రవి విద్యుత్ షాక్ తగిలి చెయ్యి కోల్పోయాడు. ఇలా చాలా వరకు విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా లైన్ కింద ఉన్న చెట్లను తొలగిస్తే విద్యుత్ సిబ్బందిపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేయాలంటేనే విద్యుత్ ఉద్యోగులు జంకుతున్నారు.
విద్యుత్ ఉద్యోగులకు
కోటి రూపాయల బీమా..
విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మృతి చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం కోటి రూపాయల ఉచిత బీమా ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా.. పని ఒత్తిడి వల్ల చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. కాగా,ఇప్పటికై నా దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గంగారంలో విద్యుత్ షాక్‌తో జేఎల్‌ఎం మృతి
ఏజెన్సీలో ఉద్యోగమంటే
వణుకుతున్న విద్యుత్‌శాఖ ఉద్యోగులు
అడవుల్లో లైన్ల
మరమ్మతులతో సతమతం