
ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులడిగితే కేసులు
● టోల్ ఫ్రీ నంబర్ 83284 73007కు
సమాచారం ఇవ్వండి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు, అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 83284 73007 కు ప్రజలు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడినా, తన పేరు చెప్పి అధికారులను, ఇతర వ్యక్తులను బెదిరించినా సహించేదిలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, అర్హులకే సంక్షేమ పథకాలు అందుతాయని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
త్వరలో మంత్రుల రాక..
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ప్రజాపాలన కొనసాగిస్తుందని, త్వరలో మహబూబాబాద్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరవుతున్నారన్నారు. సమావేశంలో కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఖలీల్, మిట్టకంటి రామిరెడ్డి, ఎడ్ల రమేశ్, నీరుటి లక్ష్మీనారాయణ, సురేశ్, అంబటి మహేందర్ రెడ్డి, బండారు వెంకన్న, భువనగిరి గిరిధర్ గుప్తా, చలమల్ల నారాయణ, పోతురాజు రాజు, బోడ రవి, శంతన్ రామరాజు, రామగోని రాజు, మానుకోట ఏఎంసీ డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.