
రైతుల గోస అర్థం చేసుకోండి..
సారూ.. 600 మంది
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు మానవతా ధృక్పథంతో స్పందించి 600 మంది రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతులు లకుపతి, బాషా, జాన్ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, ఓ మహిళా రైతు పోలీస్ అధికారి కాళ్లపై పడి తమకు సహకరించాలని, 600మంది రైతుల గోస అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారాయణపురం గ్రామంలో 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాలను 2017లో అప్పటి ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములని పేర్కొని పట్టాలు రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 94 జారీ చేసి రైతు పేరు, తండ్రిపేరున ఉన్న అడవి అనే పదం తొలగించిందన్నారు. గ్రామంలో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు పూర్తయినా పట్టాలు జారీ చేయలేన్నారు. దీంతో పాస్ పుస్తకాలు లేకపోవడంతో దాదాపు 600 మంది రైతులకు పంట రుణాలు, రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఇతరత్రా పథకాలు అందడం లేదన్నారు. వెంటనే సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారికి వినతి పత్రం అందజేశారు. డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో సీఐలు మహేందర్‌రెడ్డి, సర్వయ్య బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ధారవత్ రవి, నాయకులు, రైతులు శ్రీనివాస్, శంకర్, వెంకట్‌రెడ్డి, వీరన్న, సురేశ్, కిషన్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అధికారి కాళ్లు పట్టుకుని వేడుకున్న మహిళా రైతు
మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట నారాయణపురం రైతుల ఆందోళన

రైతుల గోస అర్థం చేసుకోండి..