
అధిక కరెంట్ బిల్లు తెచ్చిన విషాదం..
● బిల్లుపై అధికారిని అడిగొస్తున్న
క్రమంలో రోడ్డు ప్రమాదం
● వృద్ధురాలి దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు
మహబూబాబాద్ రూరల్ : ఇంటికి అధిక కరెంట్ బిల్లు రాగా ఎందుకొచ్చిందని తెలుసుకునేందుకు వెళ్లిన సందర్భంలో ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అవిరబోయిన ఐలమ్మ (69) ఇంటికి కరెంట్ బిల్లు అధికంగా (రూ.28 వేలు) వచ్చింది. దీంతో ఐలమ్మ, తన కుమారుడు నాగేశ్ ఆ విషయం తెలుసుకునేందుకు ఆటోలో ఉదయం కురవి మండల కేంద్రానికి వెళ్లి విద్యుత్ శాఖ అధికారితో మాట్లాడారు. అనంతరం తిరుగు ప్రయాణంలో నరేశ్.. తన తల్లి ఐలమ్మను ఆటోలో తీసుకొచ్చి మానుకోటలోని కురవి గేట్ ప్రాంతంలో వదిలిపెట్టాడు. తన ఆటో సీరియల్ ఆలస్యమవుతుందని పోలంపల్లి తండాకు చెందిన బాలు ఆటోలో తల్లిని ఇంటికి పంపించగా ఇదే ఆటోలో మరో ప్రయాణికుడు కూడా వెళ్లాడు. ఆటో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి సాలార్ తండా దాటి రాజోలు వైపునకు వెళ్తుండగా ఎదురుగా కురవి నుంచి మహబూబాబాద్ వైపునకు వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐలమ్మ ఆటో నుంచి కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ద్విచక్రవాహనంపై ఉన్న మానుకోట పట్టణానికి చెందిన పుచ్చకాయల తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఐలమ్మ, తరుణ్‌ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తరుణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు. కురవి ఎస్సై సతీశ్ ఘటనాస్థలిని సందర్శించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.