
మోడల్ షాదీఖానాగా తీర్చిదిద్దుతాం
● ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్
న్యూశాయంపేట : వరంగల్ ఎల్‌బీనగర్‌లోని షాదీఖానాను రాష్ట్రంలో మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న ఉర్దూఘర్ కమ్ షాదీఖానాను బుధవారం పరిశీలించారు. నిర్మాణం ఆలస్యంపై అధికారులను ఆరాతీశారు. ఇప్పటివరకు కేటాయించిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారో ‘కుడా’ ఏఈని వివరాలు అడిగారు. షాదీఖాన నిర్మాణం కోసం ‘కుడా’ రూ.3కోట్ల 50 లక్షల అంచనాతో పనులు చేపట్టామని, ఇప్పటివరకు గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులు స్లాబ్ వరకు పనులు పూర్తి అయినట్లు ఏఈ భరత్ వివరించారు. పూర్తిస్థాయిలో పనులు పూర్తికావాలంటే ఏమేరకు నిధులు అవసరమవుతాయో అంచనా వేసి తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ సహకారంతో అద్భుత షాదీఖాన నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఏడీ వి.కృష్ణ, కార్పొరేటర్లు సురేశ్‌జోషి, మహ్మద్ ఫుర్ఖాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సూపరింటెండెంట్ విజయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆయూబ్, చాంద్‌పాషా, ఆజం, యాకూబ్‌పాషా, సిరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఎంఏ తెలుగులో ప్రవేశాలకు గడువు పెంపు
హన్మకొండ కల్చరల్: వరంగల్ హంటర్ రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 2025–26 విద్యాసంవత్సరానికి రెగ్యులర్ ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశానికి గడువు ఈనెల 24తో ముగిసింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని.. ప్రవేశం పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 99894 17299, 99891 39136 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సోమిడిలో చోరీ
● రూ.2.50 లక్షల విలువైన
ఆభరణాల అపహరణ
కాజీపేట: కాజీపేట 62వ డివిజన్ సోమిడి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం చొరబడి తులం బంగారం, 49 తులాల వెండి నగలు, రూ.లక్ష నగదును అపహరించుకెళ్లారు. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. మేకల రమ తన ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఈక్రమంలో బంగారు, వెండి నగలతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

మోడల్ షాదీఖానాగా తీర్చిదిద్దుతాం