వృద్ధురాలి ప్రాణం తీసిన చింతచెట్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ప్రాణం తీసిన చింతచెట్టు

Jun 26 2025 6:30 AM | Updated on Jun 26 2025 12:45 PM

తెగిపడిన విద్యుత్‌ తీగలు పట్టుకుని రాజమ్మ మృతి

అదే తీగల్లో పడి నాలుగు పశువులూ మృత్యువాత

వాజేడు: పంట సాగు చేస్తున్నప్పుడల్లా చింతచెట్టు నీడ పడి పంట మంచిగా రావడం లేదని, ఆ చెట్టును తొలగిస్తే పంట బాగుంటుందని భావించారు వృద్ధ దంపతులు. కానీ, ఆ చెట్టు రూపంలోనే దూసుకొచ్చిన మృత్యువు ఆ దంపతుల్లో భార్య ప్రాణం తీసింది. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం మోతుకులగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. 

గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతుకులగూడెం గ్రామానికి చెందిన బండి నారాయణ, రాజమ్మ(65) దంపతులు ఆ గ్రామంనుంచి వచ్చి రేగులపాడులో కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నారు. మోతుకులగూడెం గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని బాగు చేసి కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. ఆ స్థలంలో ఒక పక్కన చింతచెట్టు ఉండడంతో సాగుకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో దానిని కూలీలను పెట్టి నరికిస్తున్నారు. తెగిన కొమ్మలను తాడుకట్టి పక్కకు లాగడంతో కొమ్మ తెగి విద్యుత్‌ తీగల మీద పడ్డాయి. దీంతో తీగలు తెగి కిందపడ్డాయి. 

తీగలు పడిన వైపు ఉన్న రాజమ్మ.. అటువైపుగా వస్తున్న రామక్క అనే మరో మహిళతో మాట్లాడుతూ తెగిపడిన తీగలను పక్కకు వేయాలనే ఉద్దేశంతో వాటిని పట్టుకుంది. వ్యవసాయ పనుల కోసం ఏర్పాటు చేసిన త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ కావడంతో రాజమ్మ పట్టుకున్న తీగ చేతిలో ఉండగానే అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే మేస్తున్న పశువులు నాలుగు తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాత పడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు మిగతా పశువుల గుంపును దూరంగా పంపించి విద్యుత్‌ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త నారాయణ విద్యుత్‌ తీగలు తెగిపడిన వైపు కాకుండా మరోవైపు ఉండడంతో అతనికి ఏమీ కాలేదు. 

కాగా, ఇన్ని రోజులు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ లైన్‌కు సరఫరా లేకపోగా, వరి నార్లు పోసుకుంటామని కొందరు రైతులు కోరడంతో విద్యుత్‌ సరఫరా చేసినట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్‌ తీగల బారిన పడి తల్లి మృతిచెందడంతో కొడుకు, కోడలు, కూతురు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వృద్ధురాలి ప్రాణం తీసిన చింతచెట్టు1
1/1

వృద్ధురాలి ప్రాణం తీసిన చింతచెట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement