
బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్ట్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం
వరంగల్ చౌరస్తా : బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరాడాలని, ఇందుకు సమయం ఆసన్నమైందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిరావు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తోందని విమర్శించారు. బడా కార్పొరేట్‌లు అంబానీ, ఆదానీలకు ప్రధాని మోదీ సీఈఓ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్య భారతంలో మావోయిస్టులు, ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండ దీనికి నిదర్శనమన్నారు. అనంతరం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం శత్రువు దేశంగా ప్రకటించిన పాకిస్తాన్, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ ఉద్యమాలు చేస్తున్న సంస్థలతో చర్చలు జరిపిందన్నారు. కానీ మావోయిస్టులతో మాత్రం చర్చలు ఉండవని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికై నా మధ్య భారతంలో హత్యాకాండను ఆపి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మండల వెంకన్న, కె.గోవర్ధన్, ఆవునూరి మధు, గౌని ఐలయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ముక్తి, సత్యం, రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర సదస్సుకు ఆ పార్టీ నాయకులు వారం క్రితం పోలీసు అధికారుల అనుమతి కోరగా వారు నిరాకరించారు. అయితే మరోసారి పార్టీ నాయకులు విజ్ఞప్తి మేరకు అనుమతి ఇవ్వగా సదస్సు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జరిగింది.
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిరావు