
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందవేమోనని...
నెల్లికుదురు: ఆయనో ప్రధానోపాధ్యాయుడు. ఉద్యోగ విరమణ పొంది 9 నెలలైంది. ఇంకా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాలేదు. దీంతో మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన కొండేటి సోమిరెడ్డి (63) హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 30న విరమణ పొందాడు. నాలుగు నెలలలోపు ప్రభుత్వంనుంచి రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సుమారు రూ.56 లక్షలు 9నెలలైనా అందలేదు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పొందేవారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8వేల మంది ఉన్నారని, వారిలో నీకు అందే వరకు ఎన్నేళ్లు పడుతుందోనని స్థానికులు రకరకాలుగా మాట్లాడారు. దీంతో తనకు ఆ డబ్బులు వస్తాయో..రావోనని, కూతురుకు, ఇతరులకు సెటిల్‌మెంట్లు చేయాల్సి ఉందని మదనపడుతుండేవాడు. ఇలా మనోవేదనకు గురైన సోమిరెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమిరెడ్డి మంగళవారం రాత్రి చనిపోయాడు. ఉద్యోగ విరమణ పొందిన నాలుగు నెలలలోపే అందించాల్సిన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందలేదని, సమయానికి బెనిఫిట్స్ ప్రభుత్వం అందిస్తే తమ నాన్న బతికేవాడని మృతుడి కుమారుడు కొండేటి కిశోర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడికి భార్య సునీత, ఒక కొడుకు కిశోర్‌రెడ్డి, కూతురు ఉన్నారు.
అనారోగ్యంతో ఉపాధ్యాయుడి మృతి
హెచ్‌ఎంగా 9నెలల క్రితం
ఉద్యోగ విరమణ పొందిన సోమిరెడ్డి
మహబూబాబాద్ జిల్లాలో ఘటన