మహబూబాబాద్ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారు విద్యా వ్యతిరేక విధానాలను విడనాడాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం చలో హైదరాబాద్ కార్యక్రమ కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసిన గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీశైలం, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రాజు, నాయకులు శ్రీనివాస్, ఉపేందర్, భిక్షపతి, రామలింగారెడ్డి, మహేశ్, శ్రావణ్ కుమార్, అశోక్, నరసింహారావు ఉన్నారు.