
బాలాజీ.. పీఎఫ్ బోలోజీ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ పీఎఫ్, ఈఎస్‌ఐ పేరుతో జీతంలో కోత పెట్టింది. కానీ ఆ సొమ్మును పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. మూడు నెలల పాటు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ తప్పుకున్న తర్వాత సిస్‌కాన్ ప్రస్తుతం రెండు నెలలకు పైగా డ్రైవర్లను సమకూరుస్తోంది. ఈ రెండు సంస్థలు గత ఐదు నెలలకుపైగా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదని, కానీ, జీతాల్లో కోత పెడుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటివరకు ఐదు నెలల కాలానికి ఒక్కో డ్రైవర్‌నుంచి నెలకు రూ.3వేల చొప్పున కట్ చేశారు. 287మంది డ్రైవర్లు జేబీఎం బస్సులు నడుపుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.8.61 లక్షలు వసూలు చేశారు. ఐదు నెలలకు 287మందినుంచి రూ.43.05లక్షలు కోత పెట్టారు. ఈ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందని జేబీఎం డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.
112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు..
టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. వీటిలో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంది. వీటిని జనవరి 6న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు.
కన్సల్టెన్సీ ప్రతినిధి ఏమంటున్నారంటే..
ఈ విషయమై గతంలో శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ ప్రతినిధిగా, ప్రస్తుతం సిస్‌కాన్ బాధ్యుడిగా పని చేస్తున్న వేణుమాధవ్‌ను వివరణ కోరగా త్వరలో డ్రైవర్లకు పీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీఎఫ్, ఈఎస్‌ఐ పేరుతో వసూలు చేసిన సొమ్మును తిరిగి డ్రైవర్లకు జీతాలతో కలిపి చెల్లించనున్నట్లు చెప్పారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల పీఎఫ్ సొమ్ము కాజేస్తున్న కన్సల్టెన్సీలు..
మొదటి మూడు నెలలు జేబీఎంకు
డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ
ఆ తరువాత తప్పుకుని
సిస్‌కాన్‌కు అప్పగింత
287మంది డ్రైవర్ల వద్ద పీఎఫ్ కోసం రూ.3 వేల చొప్పున కోత
ఐదు నెలలైనా పీఎఫ్ ఖాతాలు
ప్రారంభించని శ్రీ బాలాజీ, సిస్‌కాన్
తమ సొమ్ము కాజేతపై ఆందోళన
చెందుతున్న డ్రైవర్లు