
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్‌లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈ మేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. గురువారం సహస్రకలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరుపున భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేస్తామన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి...
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, క్యూలైన్‌లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు.