
మరణంలోనూ నీ వెంటే..
● భార్య సమాధి వద్ద.. గడ్డి మందుతాగిన భర్త
● 20 రోజుల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య
కేసముద్రం: పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఇది జీర్ణించుకోలేక ఆమె సమాధి వద్ద గడ్డిమందు తాగి భర్త ఆత్మహత్యకు పాల్ప డిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరిగింది. 20రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్సై మురళీధర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. జల్లి బాబు(40)–నిర్మల(38) దంపతులకు కూతురు మధుప్రియ ఉంది. దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కాగా గత నెల 30న నిర్మల.. తన సమీప బంధువుల మధ్య ఇంటిస్థలం విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఈనెల 4న మృతి చెందింది. కాగా భార్య మృతిని తట్టుకోలేక బాబు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె సమాధి వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని 108లో మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 20 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ కానరానిలోకాలకు వెళ్లడంతో కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.