
ఇనుగుర్తిలో విషాదఛాయలు
● హైదరాబాద్‌లో గ్రామవాసి అంజలి హత్య
● మిన్నంటిన కుటుంబీకులు, గ్రామస్తుల రోదనలు
కేసముద్రం: ఇనుగుర్తిలో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన సట్ల అంజలి(39)హైదరాబాద్‌లో తన పెద్ద కూతురు, ఆమె ప్రియుడి చేతిలో సోమవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహం మంగళవారం రాత్రి తన స్వగ్రామం ఇనుగుర్తికి చేరింది. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బోరున విలపించారు. గ్రామానికి చెందిన సట్ల ధనమ్మ, మల్లయ్య దంపతుల రెండో కూతురు అంజలికి 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జీడిమెట్లలో కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తూ, తెలంగాణ సాంస్కృతిక సారథిలో గాయకురాలిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. కాగా, అంజలి పెద్దకూతురు ఓ యువకుడితో ప్రేమలో పడింది. దీనిని అంజలి నిరాకరించగా, పెద్దకూతురు, తన ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేశారు. కాగా, ఇనుగుర్తిలో అంజలి మృతదేహంపై పీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంస్కృతిక కళాబృందం సభ్యులు గీతాలు ఆలపించి నివాళులర్పించారు.
అంజలికి.. చాకలి ఐలమ్మతో ఎలాంటి సంబంధమూ లేదు..
పాలకుర్తి టౌన్: అంజలి.. వీరనారి చాకలి ఐలమ్మ మునిమనుమరాలిగా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై ఐలమ్మ మనుమడు చిట్యాల సంపత్ స్పందించారు. సట్ల అంజలికి, ఐలమ్మకు ఎలాంటి సంబంధమూ లేదని, ఇద్దరూ ఒకటే సామాజికవర్గం అయినంత మాత్రాన కుటుంబ వారసురాలిగా వైరల్ చేయడం సరికాదని తెలిపారు. గతంలోనూ తన నాయనమ్మ పేరు వాడితే మా తండ్రి రామచంద్రు ఆమెను హెచ్చరించారని గుర్తు చేశారు.