
కనీస సౌకర్యాలు కరువు
మహబూబాబాద్: ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతం కోసం ఈ ఏడాది అమ్మ మాట–అంగన్‌వాడీ కార్యక్రమం చేపట్టింది. కేంద్రాల ద్వారా కొనసాగుతున్న కార్యక్రమాలపై తల్లిదండ్రులకు తెలి యజేసి పిల్లల పేర్లు నమోదు చేశారు. ప్రీ ప్రైమ రీ విద్యా ప్రాధాన్యతను వివరిస్తున్నారు. అయితే కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. అలాగే పోస్టుల ఖాళీలతో పర్యవేక్షణ సక్రమ ంగా లేక నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.
1,435 కేంద్రాలు..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్,గార్ల,కురవి,గూడూరు ప్రాజెక్ట్ ప రిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ, మానుకో ట ప్రాజెక్ట్ పరిధిలో బయ్యారం,కేసముద్రం, మానుకోట, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూ రు ప్రాజెక్ట్ పరిధిలో నెల్లికుదురు, తొర్రూరు పెద్దవంగర మండలాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలోపు పిల్లలు 3,604మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 20,295మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారు. 330 కేంద్రాలు సొంత భవనాలు, 625 కేంద్రాలు అద్దె లేకుండా(ఫ్రీ రెటెండ్)భవనాలు, 80కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
మరుగుదొడ్లు లేని కేంద్రాలు 732..
జిల్లాలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 732 సెంటర్లలో మరుగుదొడ్లు లేవు. 703 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. 397 కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేక టీచర్లు, ఆయాలు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో 302 సెంటర్లు సొంత భవనాల్లో కొనసాగుతుండగా.. 206 కేంద్రాల్లో మరుగుదొడ్లు, 272 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, 137 కేంద్రాల్లో తాగు నీటి సౌకర్యం లేదు. కనీసం సొంత భవనాల్లో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం జూన్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాల వివరాలు ఇవ్వాలని ఆశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే నివేదిక పంపిస్తారు. అయితే ఇవి ప్రతిపాదలకే పరిమితమవుతున్నాయి.
భారీగా ఖాళీలు..
జిల్లాలో 116 టీచర్, 576 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 58 మంది సూపర్‌వైజర్లకు 46 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలతో పర్యవేక్షణ సక్రమంగా లేదు. చాలా మంది టీచర్లు సమయపాలన పాటించడం లేదు. కొంత మంది టీచర్లు, ఆయాలు తప్పులు చేసినా కేవలం మోమోలు జారీ చేసి వదిలేస్తున్నారు.
నివేదిక తయారు చేస్తున్నాం..
జిల్లాలో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి నివేదిక తయారు చేస్తున్నాం. కమిషనర్‌కు నివేదిక పంపిస్తాం. అత్యవసరం ఉన్న కొన్ని కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం.
– ధనమ్మ, డీడబ్ల్యూఓ
అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక అవస్థలు
జిల్లాలో 732 సెంటర్లలో లేని
మరుగుదొడ్లు
ప్రతిపాదనలకే పరిమితం
వేధిస్తున్న సిబ్బంది కొరత