
రైతును రాజు చేయడమే ధ్యేయం
కురవి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం నిరంతరం పని చేస్తోందని, రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లోనే రూ. 9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని డిప్యూటీ స్పీకర్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. రైతు భరోసా సంబురాల్లో భాగంగా కురవి రైతు వేదికలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం గుడి సెంటర్‌లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి రాంచంద్రునాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ఫ్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ యువవికాసం తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ఎన్ని అడ్డకుంలు వచ్చినా ఇచ్చిన మాట ను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలకు పార్టీ నాయకులందరూ వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ విజయలక్ష్మి, ఏడీఈ విజయచంద్ర, ఏఓలు మోహన్, శ్రీదేవి, నరసింహరావు, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, నాయకులు బండి వెంకటరెడ్డి, గార్లపాటి భరద్వాజ్‌రెడ్డి, నారాయణ, రాజేందర్‌కుమార్, అవిరె మోహన్‌రావు, బాలగాని శ్రీనివాస్, బండి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్
జాటోత్ రాంచంద్రునాయక్
రైతు భరోసా సంబురాల్లో
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం