రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను సోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించారు. జిల్లాలో నూతనంగా 36 రైతు వేదికల్లో రైతు నేస్తాలను ప్రారంభించారు. వీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి గ్రామ శివారు చంద్రుతండాకు చెందిన మహిళా రైతు అజ్మీరా ద్వాలీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆమె సాగు చేస్తున్న పంటల వివరాలు, రైతు రుణమాఫీ జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్వాలీ మాట్లాడుతూ.. తనకు రూ.1,65,509 రైతు రుణమాఫీ అయిందని, రైతు భరోసా కింద రూ.12 వేలు తన ఖాతాలో జమ అయ్యాయని తెలిపింది. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని, ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వానికి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. రైతు వేదిక నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల, జిల్లా హార్టికల్చర్ అధికారి జి.మరియన్న, ఏఓ ఎన్.తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ఫామ్ అడ్వైజరీ మెంబర్ వల్లూరి కృష్ణారెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, రైతులు సత్తిరెడ్డి, రవి, బుచ్చిరెడ్డి, ఏఈఓలు పూజిత, సాయి ప్రకాశ్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా రైతు ద్వాలీతో
మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా రైతు నేస్తం
వీసీల ప్రారంభం


