రెబల్స్..దారెటు!
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తుండగానే ముగిసిపోయాయి. నిన్నటి వరకు తమ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు రెబల్ సర్పంచ్‌లను ఏం చేద్దామని తర్జనభర్జన పడుతున్నారు. ఒక వైపు మేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అని రెబల్ సర్పంచ్‌లు చెబుతుండగా.. పార్టీ ఓటమికి కారణం వారే.. వారితోపాటు, వారికి మద్దతు తెలిపిన నాయకులను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని పార్టీ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన వారు అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.
34 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల గెలుపు..
మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస పార్టీ మద్దతు తెలిపిన వారు కాకుండా.. మద్దతు తెలుపలేదని విభేదించి పోటీలో నిలబడి గెలిచిన వారు మొత్తం 34మంది ఉన్నారు. ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండలం నుంచి ముగ్గురు, దంతాలపల్లి నుంచి నలుగురు, నర్సింహులపేట నుంచి ఒకరు.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూబాబాద్ మండలంలో ముగ్గురు, కేసముద్రం నుంచి ఒకరు, గూడూరు నుంచి ముగ్గురు, నెల్లికుదురు నుంచి ఒకరు.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబల్‌గా నిలబడి గెలిచారు. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో నలుగురు, గార్ల మండలంలో నలుగురు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ రెబల్‌గా నిలబడి గెలిచారు.
మాదీ కాంగ్రెస్ పార్టీ అంటున్న రెబల్స్..
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాం. పార్టీ మద్దతు ఇవ్వలేదు. కానీ పోటీ చేసి గెలిచినం. అంతే కానీ కాంగ్రెస్ పార్టీని విడిచి పోలేదని రెబల్ సర్పంచ్‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీ పెద్దలను, ఎమ్మెల్యేలను కలిసి తాము పార్టీలోనే ఉన్నామని చెప్పారు. వారితోపాటు మద్దతు తెలిపిన నాయకులు కూడా గెలిచిన సర్పంచ్‌లు కాంగ్రెస్‌లోనే ఉన్నారని, గ్రామస్థాయిలో వారి బలాన్ని మనమే అంచనా వేయకుండా మద్దతు తెలుపలేదని నాయకులకు చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో నూతన సర్పంచ్‌ల లొల్లి
పార్టీలోకి రానివ్వొద్దు అంటున్న
ఓడిన అభ్యర్థులు
మాది కాంగ్రెస్ పార్టీనే అంటున్న
రెబల్ సర్పంచ్‌లు
నాయకులకు తలనొప్పిగా వ్యవహారం
రెబల్స్‌కు బీఆర్‌ఎస్ గాలం
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీలో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం రెబల్ సర్పంచ్‌లపైమండిపడుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకు పనిచేశాం. లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాం.. పార్టీలోనే రెబల్‌గా నిలబడి ఓట్లు చీల్చారు. ఇప్పుడు వారిని పార్టీలోకి తీసుకుంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెబల్ సర్పంచ్‌లతో పాటు వారికి మద్దతుగా ఉన్న నా యకులు, కార్యకర్తలను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి లో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు సంకట స్థితి లో పడ్డారు. గెలిచిన వారినిపార్టీలోకి రానివ్వకుంటే పార్టీ రెండుగా చీలిపోతుందని, ఈ ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. ఒక వేళ వారిని పార్టీలో కి తీసుకుంటే.. పార్టీకోసం నిలబడి డబ్బులు ఖర్చుచేసిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై గ్రామ స్థాయిలో మాట్లాడుకొని గెలిచిన వారు.. ఓడిన వారిని తీసుకొచ్చి పార్టీలో చేరాలని, భేషజాలకు పోకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉన్న పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లను బీఆర్‌ఎస్ తమ పార్టీలోకి రావాలని గాలం వేస్తున్నారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని అనుచరుల ద్వారా కబురు పెడుతున్నట్లు ప్రచారం.


