ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువులు పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. హైదరాబాద్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. ఈ స ందర్భంగా గోపి మాట్లాడుతూ.. ఇకపై రైతులు యూరియా కోసం సమయం కేటాయించాల్సిన అవసరంలేదన్నారు. రైతులు పంటల కోసం వినియోగిస్తున్న యూరియా ఎంత మేరకు అవసరం, ఆ కోటాను రైతులు వారి ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్‌ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, సాంకేతిక వ్యవసాయ సహాయ సంచాలకుడు మురళి, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి రాంజీ, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
యాప్ ద్వారా యూరియా సరఫరా చేయాలి
కురవి: ఎరువుల డీలర్లు యాప్ ద్వారా ముందుగా బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా పంపిణీ చేయాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. గురువారం కురవి రైతువేదికలో యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాప్‌లో బుక్ చేసిన రైతులకు యూరియా సరఫరా చేయకపోతే సదరు డీలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ యాప్ ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతులు దీనిపై అవగాహన పెంచుకుని యూరియా బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గుంటక నర్సింహరావు, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
పంట మార్పిడితో
రెట్టింపు ఆదాయం
బయ్యారం: పంట మార్పిడి వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖాధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం బయ్యారంలో ఆయన పర్యటించి సాగు చేసిన పచ్చిరొట్ట పంటను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్, ఉద్యాన, మల్బరీ, కూరగాయలు, మునగ వంటి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించడం వల్ల మెరుగైన ఆదాయం వస్తుందన్నారు. పచ్చిరొట్ట పంటను సాగు చేయడం వల్ల భూమిలో పోషక విలువలు పెరుగుతాయన్నారు.
రేపు కేయూలో
అవగాహన సదస్సు
కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి.బి నిర్మల గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అని తారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనో హర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామి డాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ మేఘనరావు తెలిపారు.
పుణ్యస్నానాలు.. మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్


