కుష్ఠును తరిమేద్దాం..
● లెప్రసీ కట్టడికి వైద్యారోగ్యశాఖ చర్యలు
● ప్రారంభమైన ఇంటింటి సర్వే
నెహ్రూసెంటర్: ప్రమాదకరమైన కుష్ఠువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నివారణే ధ్యేయంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో 886 బృందాలతో ఇంటింటి లెప్రసీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,28,374 ఇళ్ల సర్వేలో భాగంగా పరీక్షలు చేపట్టి కుష్ఠువ్యాధి అనుమానితులును గుర్తించనున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం 70కుష్ఠు కేసులు ఉన్నాయి.
వ్యాధి లక్షణాలు..
చర్మంపై మచ్చలు, మొద్దుబారిన మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నివారించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మచ్చలు ఎరువు లేదా రాగి, గోధుమ రంగులో ఉండడంతో పాటు మచ్చలు ఏర్పడిన చోట ఎలాంటి స్పర్శ ఉండదు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించడం ద్వారా చికిత్స తీసుకుని నివారించ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది శరీరంలో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా రెండేళ్ల వయసు పైబడిన వారికి వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాఽధి కట్టడికి..
కుష్ఠు వ్యాధి నివారణకు జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇంటింటికీ వైద్యారోగ్యశాఖ సిబ్బంది వెళ్లి అవగాహన కల్పించడం, అనుమానితులను పరీక్షించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఆశకార్యకర్తలు సర్వేలు నిర్వహించి అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. జిల్లాలో సర్వే నిర్వహించి ప్రతీ ఒక్కరిని పరీక్షించి వ్యాధి వ్యాప్తి కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా వైద్య చికిత్సను అందించనున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే..
కుష్ఠు వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరువు, గోధుమరంగు మచ్చలు ఉన్నట్లయితే, అనుమానితులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నివారణకు ప్రజలు అవగాహన పెంచుకుని ముందుకు రావాలి. వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి, నివారణ చర్యలు తీసుకుంటున్నాం.
– రవిరాథోడ్, డీఎంహెచ్‌ఓ
సర్వే చేయాల్సిన రోజులు 14
సర్వే బృందాలు 886
విజిట్ చేయాల్సిన ఇళ్లు 2,28,374
ప్రస్తుతం కేసుల సంఖ్య 70
కుష్ఠును తరిమేద్దాం..


