రూ.49.34కోట్ల మద్యం విక్రయాలు
మహబూబాబాద్ రూరల్: మూడు విడతల్లో కొనసాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రూ.49.34 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా అన్ని పార్టీలు జీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రతీ గ్రామంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు ఇచ్చారు. ఇందులో అధికంగా మద్యం బాటిళ్లు ఓటర్లకు పంపిణీ చేశారు. కాగా ఈనెల 1నుంచి 17వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 47,363 లిక్కర్ బాక్సులు, 48,684 బీర్ల బాక్సులు మొత్తంగా రూ.49.34 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికలవేళ...పెరిగిన మద్యం విక్రయాలు..
సాధారణంగా జిల్లాలో ప్రతీనెల సుమారు రూ.50 నుంచి రూ.55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నెలరోజుల పాటు జరగాల్సిన మద్యం విక్రయాలు కేవలం 15రోజుల వ్యవధిలోనే రూ.49.34 కోట్ల మేరకు జరిగినట్లు తెలిసింది.


