నిందితులను కఠినంగా శిక్షించాలి
● మృతుడి కుటుంబీకుల డిమాండ్
● కుమారస్వామి మృతదేహంతో ఆర్టీఏ జంక్షన్ వద్ద ఆందోళన
ఖిలా వరంగల్: తన భూమిని కబ్జా చేశారంటూ వరంగల్ కరీమాబాద్‌కు చెందిన పోలెపాక కుమారస్వామి(55) మనస్తాపంతో ఈనెల 9వ తేదీన శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌లో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందగా.. సోమవారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్ వద్ద కుమారస్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. కబ్జాకు పాల్పడిన బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల మల్లేశంను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన మామునూరు, మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
భార్యపై బెంగతో యువకుడి ఆత్మహత్య
● ఎల్కతుర్తిలో ఘటన ● మృతుడు రాజస్థాన్ వాసి
ఎల్కతుర్తి: ఏడు నెల గర్భవతి అయిన తన భార్యను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే (సపర్యలు) బెంగతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని జై బాలాజీ స్టోన్స్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని గోగవస్ సికర్ జిల్లాకు చెందిన రాజేంద్రకుమార్ జాకర్ (21) రెండు నెలల క్రితం ఎల్కతుర్తి వచ్చి జై బాలాజీ స్టోన్స్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య 7నెలల గర్భవతి. ఈ సమయంలో తన దగ్గరుండి చూసుకోలేకపోతున్నానని కొన్ని రోజు లుగా స్నేహితులతో చెప్పుకుని మదనపడేవాడు. ఈ విషయంపై మనస్తాపం చెందిన రాజేంద్రకుమార్ జాకర్ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధులవుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
అప్పుల బాధతో వ్యాపారి..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : అప్పుల బాధతో ఓ గాజుల వ్యాపారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్‌కు చెందిన పిల్లి సత్యం(50), జ్యోతి దంపతులు 12 సంవత్సరాల నుంచి మేడారంలో గాజుల దుకాణం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సత్యం వ్యాపారం కోసం రూ. 10 లక్షల అప్పు చేశాడు. వ్యాపారం సరిగా నడవకపోవడంతోపాటు అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. ఈక్రమంలో సోమవారం దుకాణం వెనుక రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.


