శాంతియుత వాతావరణంలో జీవించాలి
మహబూబాబాద్ రూరల్: ప్రతిఒక్కరూ శాంతియుత వాతావరణంలో జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై బరువు తగ్గించేందుకు, వివిధ కేసుల్లో ఇరువర్గాల వారితో మాట్లాడి పరిష్కరిస్తారని తెలిపారు. కేసుల కొట్టివేత కోసం నిరంతరం కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడొద్దనే ఆలోచనతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు కోర్టుల్లో 13,500 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, ఇలాగైతే కేసుల సంఖ్య పెరిగిపోతుందని అన్నారు. నేర ప్రవృత్తిని తగ్గించాలని, లోక్ అదాలత్ ఒక పరిష్కార వేదికగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారీ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, డీఎస్పీ తిరుపతిరావు, ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నగేష్ కుమార్, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
8,495 కేసుల పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 8,495 కేసులను పరిష్కరించగా ఇందులో వివిధ రకాల 2,437 కోర్టు కేసులు, 5,465 పోలీస్ చలాన కేసులు ఉన్నాయి. వాటితోపాటుగా 15 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో రూ.59.85 లక్షల నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించే విధంగా ఆదేశించారు. 497 క్రిమినల్ కేసుల్లో నేరాన్ని అంగీకరించిన వారికి రూ.32.88 లక్షల 400 రూపాయల జరిమానా విధించారు. 17 సైబర్ నేరాల కేసులు పరిష్కారమవ్వగా రూ.2.62 లక్షలను బాధితులకు తిరిగి ఇచ్చే విధంగా ఆదేశించారు. 53 టెలిఫోన్, సైబర్, బ్యాంకు సంబంధిత కేసులు పరిష్కారం అవ్వగా వాటిలో కక్షిదారులు రూ.13 వేల 170 రూపాయలు చెల్లించి రాజీ చేసుకున్నారు. 7 సివిల్ కేసులు, 4 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమయ్యాయి.
588 కేసుల పరిష్కారం
తొర్రూరు: స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 588 కేసులు పరిష్కారమయ్యాయి. జడ్జి ధీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసుల విచారణ చేపట్టి సివిల్, క్రిమినల్, పెటీ, ఎకై ్సజ్, సైబర్ క్రైమ్ తదితర కేసులు పరిష్కరించారు. అన్ని కేసుల్లో జరిమానా కింద రూ.20.5 లక్షలు విధించారు. కార్యక్రమంలో ఏపీపీ రేవతిదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముకుందరావు, సీఐ గణేష్, బార్ ప్రతినిధులు అశోక్, భాస్కర్, వెంకన్న, ఐలోని, మహేష్, కుమార్‌లు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ


