
మానుకోటలో అబార్షన్
ముగ్గురిపై కేసు నమోదు
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన అబార్షన్ ఘటనపై ‘గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌కు యత్నం’ అనే శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్ అధ్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశాల మేరకు అబార్షన్ ఘటనపై విచారణ ముమ్మరం చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవిరాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ శుక్రవారం తెలిపారు. సదరు మహిళా అబార్షన్‌కు కారణమైన కాంతి మోమోరియల్ ఆస్పత్రి నిర్వాహక వైద్యులు రామకృష్ణనాయక్, మహిళను అబార్షన్ కోసం తీసుకువచ్చిన ఆర్‌ఎంపీ వైద్యుడు గణేష్, ఆమెకు స్కానింగ్ నిర్వహించిన నెక్కొండకు చెందిన యూఎస్‌జీ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా హాస్టల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అర్హులైన బాల, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారిణి ఓలేటి జ్యోతి శుక్రవారం తెలిపారు. జూన్ 1 నుంచి 13వ తేదీ వరకు పలు క్రీడా అంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. జూన్ 1న సిద్దిపేటలో వాలీబాల్, జూన్ 10, 11 తేదీల్లో ఓయూ క్యాంపస్‌లో సైక్లింగ్, వెల్‌డ్రోమ్, హనుమకొండలో అథ్లెటిక్, జిమ్నాస్టిక్ ఎంపిక ఉంటుందన్నారు. స్టడీ సర్టిఫికెట్లు, కుల ఆదాయం, నివాసం, 5 పాస్ ఫొటోలతో ఆయా జిల్లాల్లో ఉదయం 7 గంటలకు హాజరుకావాలని, అండర్ 14 నుంచి అండర్ 16 వరకు వయస్సుల వారీగా ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
నేటి నుంచి కేసముద్రంలో 17 రైళ్లకు హాల్టింగ్
కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్‌లో నేటి (శనివారం) నుంచి 17 రైళ్లకు తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాజీపేట–కొండపల్లి రైల్వే సెక్షన్‌ల మధ్య జరుగుతున్న మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా చేపట్టిన నాన్ ఇంటర్‌లాకింగ్ వర్క్స్‌తో మహబూబాబాద్‌లో తాత్కాలికంగా హాల్టింగ్ తొలగించి, కేసముద్రంలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల 24 (శనివారం) నుండి 26వ తేదీ వరకు మణుగూరు–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12746), మచిలీపట్నం–బీదర్ (12749), కాకినాడ పోర్ట్–లింగంపల్లి (12737), గూడూరు–సికింద్రాబాద్ (12709), తిరుపతి–సికింద్రాబాద్ (12763), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), విశాఖపట్నం– మహబూబ్‌నగర్ (12861), తాంబరం–హైదరాబాద్ (12759), భువనేశ్వర్–ముంబాయి సీఎస్‌టీ (11020), షాలీమార్–హైదరాబాద్ (18045), ఈనెల 26న కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ(17206), 27న బెంగళూరు–లాల్‌ఖాన్(05073), కోయంబత్తూర్–ధన్‌బాద్ (03680), మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ (17208), 24న తిరుపతి–కరీంనగర్ (12761), ఈనెల 26, 27వ తేదీల్లో నర్సాపూర్–నాగర్‌సోల్ (12787), 25 నుంచి 27 వరకు చైన్నె సెంట్రల్– అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (12656)లకు హాల్టింగ్ కల్పించనున్నట్లు తెలిపారు.
ఎంబీఏ పరీక్షల పరిశీలన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం క్యాంపస్‌లోని కామర్స్‌అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంటు విభాగం పరీక్షకేంద్రాన్ని రిజిస్ట్రార్ వి.రామచంద్రం సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయనవెంట కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, డాక్టర్ ప్రగతి ఉన్నారు.