
ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల పరీక్ష
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం గ్రామపాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపాలన అధికారుల పరీక్షకు 152 మంది అభ్యర్థులకు 130 మంది అభ్యర్థులు హాజరై, 22 మంది గైర్హాజరయ్యారన్నారు. గతంలో రెవెన్యూశాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు గ్రామ పాలన అధికారుల పరీక్ష రాశారన్నారు. పరీక్షకు సహకరించిన అన్ని శాఖ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నేడు లైసెన్స్‌డ్
సర్వేయర్లకు శిక్షణ
మహబూబాబాద్: జిల్లాలోని లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నేడు(సోమవారం) మానుకోట పట్టణం అనంతారం రోడ్డులోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్‌ఎల్‌ఆర్ ఏడీ నర్సింహమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 390మంది గుర్తింపు పొందిన సర్వేయర్లు ఉన్నారన్నారు. 203 మందికి మొదటి విడతలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు చెప్పారు.
టీజీఈసెట్‌లో సత్తాచాటిన మండలవాసి
చిన్నగూడూరు: తెలంగాణ ఈసెట్ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో మండలవాసి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించింది. మండలంలోని జయ్యారం గ్రామానికి చెందిన తిప్పర్తి భాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఈసెట్ రాష్ట్రస్థాయి ఫలితాల్లో 234వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తేజోన్నత రెడ్డి, ఉపేందర్ సహకారంతో ర్యాంక్ సాధించినట్లు ఆమె తెలిపింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఆర్ట్స్ కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్ అధికారిగా జితేందర్
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.జితేందర్‌ను నియమిస్తూ ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగ కల్పన చేపట్టేందుకు ఈప్లేస్‌మెంట్ సెల్ అధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ నియమాక ఉత్తర్వులను జితేందర్‌కు అందించి అభినందించారు.
కోటగుళ్లలో పూజలు
గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆదివారం స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కోటగుళ్ల సందర్శన ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని, ఆలయ శిల్ప సంపద అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల పరీక్ష