
ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలుకు కసరత్తు
● మొదటి విడతలో 1,235
మంది రైతుల ఎంపిక
● బోర్లు, పంపుసెట్, సౌర విద్యుత్ కల్పన
● భూ అనుకూలతను బట్టి పంటల సాగు
● కసరత్తు ప్రారంభించిన జిల్లా అధికారులు
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు పోడు భూము ల హక్కులను సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గిరిజన రైతులు భూములు సాగుచేసి లాభాల పంటలు పండించాలంటే నీటి వనరు కల్పన ప్రధానం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలు చేసేందుకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శ్రీకారం చుట్టారు.
మొదటి విడత 1235మంది రైతులకు..
ప్రభుత్వం ఇందిర గిరి జలవికాస పథకాన్ని ఐదు విడతలుగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడత 1235 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న రైతులను ఎంపిక చేయనున్నారు. గతంలో 214 కుటుంబాలకు గిరి వికాసం పథకం పేరుతో సాగునీటి వసతి కల్పించారు. ఆ తర్వాత కొత్తగా గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్, కురవి మండలాల పరిధిలో 164 గ్రామ పంచాయతీలు, 340 అవాస ప్రాంతాలకు చెందిన 24,181 కుటుంబాలకు 67,730 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం నీటి వనరులు ఉన్న భూములు, గిరి వికాసం లబ్ధిదారులు పోను మిగిలిన వారిని ఐదు భాగాలుగా విభజిస్తారు. ఈ వానాకాలం సీజన్ వరకు మొదటి విడతగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి భూములకు సాగునీరు అందించనున్నారు.
కమిటీల ద్వారా ఎంపిక..
లబ్ధిదారుల ఎంపిక కోసం మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇందులో మండల అభివృద్ధి అధికారి, భూగర్భజల అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి, గిరిజనాభివృద్ధిశాఖ అధికారి ఉంటారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మెట్ ప్రకారం గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను పరిశీలించి భూమిలో బోరు పడే ప్రాంతాలను గుర్తిస్తారు. విద్యుత్ సరఫరా కోసం యూనిట్‌కు రూ. 6లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో సోలార్ ఉత్పత్తి పరికరాలను అమర్చుతారు. బోరుబావిలో మోటారు బిగిస్తారు. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత భూముల స్వభాన్ని భట్టి జామ, బాంబో, ఆయిల్‌పామ్ తదితర తోటల పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తారు. వందశాతం సబ్సిడీతో డ్రిప్, ఇతర పరికరాలు అందజేస్తారు.
కసరత్తు ప్రారంభించాం
ఇందిర సౌర గిరి జల వికాస పథకం అమలుకోసం కసరత్తు ప్రారంభించాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గిరిజన ప్రాంతాల్లోని మండల అధికారులతో సమీక్షలు నిర్వహించాం. మండల కమిటీల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నాం. ప్రక్రియ వేగవంతంగా చేపట్టి గిరిజన భూములను సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
– దేశిరాం నాయక్,
జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి
సౌర విద్యుత్‌తో అదనపు ఆదాయం
ఇందిర సౌర గిరి జల వికాస పథకం ద్వారా గిరిజనుల భూముల్లో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా కరెంట్ సరఫరా జరుగుతుంది. ఈ విద్యుత్‌తో పంపుసెట్లు నడిపించుకోగా మిగులు విద్యుత్‌ను.. ఉత్పత్తి సంస్థకు అమ్మే అవకాశం ఉంటుంది. ఇలా మిగులు విద్యుత్ ద్వారా గిరిజన రైతులకు నెలకు రూ. 5వేల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలుకు కసరత్తు