
పుష్కర స్నానం.. పులకించిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు రోజురోజుకూ భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఏడోరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కాళేశ్వరానికి తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించి, నదీమాతకు పూజలు చేశారు. పిండప్రదాన పూజలు చేశారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కాళేశ్వరాలయంలో కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు.
ఏడోరోజు లక్షకుపైగా...
హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి రహదారి మీదుగా, పెద్దపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలివచ్చాయి. సిరొంచ అంతర్రాష్ట్ర వంతెన గుండా మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. ఆరో రోజు తగ్గిన భక్తులు.. ఏడో రోజు రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్‌లో బారులుదీరారు.
ప్రముఖుల పూజలు..
సరస్వతీనది పుష్కరాల్లో ప్రముఖులు స్నానం ఆచరించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ఝా, ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు పుష్కర స్నానం చేసి కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అలాగే, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ దంపతులు కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు.
వర్షంతో ఇబ్బందులు..
రెండు రోజులుగా ఉక్కపోత, ఎండ తీవ్రతతో తల్ల డిల్లిన భక్తులకు బుధవారం సాయంత్రం గంట పాటు కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేశారు. మరో వైపు పుష్కరఘాట్‌లో పార్కింగ్ స్థలాలు బురదమయంగా మారాయి. గాలి దుమారానికి బస్టాండ్ సమీపంలో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఉజ్వల్‌పై రేకు లేచి పడడంతో తీవ్రగాయమైంది. రక్తస్రావం కాగా వెంటనే అంబులెన్స్ ద్వారా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు.
సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ
వివిధ రాష్ట్రాల నుంచి భారీగా రాక
ఎమ్మెల్యేలు వినోద్, అనిరుధ్‌రెడ్డి, సీపీ అంబర్‌కిశోర్‌ఝా, ఎస్పీ శ్రీనివాసరావు పుణ్యస్నానాలు
ఏడో రోజు లక్షకుపైగా తరలొచ్చిన జనం
వర్షంతో చల్లబడిన వాతావరణం