
విత్తన చట్ట నియమాలు పాటించాలి
మహబూబాబాద్ అర్బన్: వ్యాపారులు విత్తన చట్ట నియమ, నిబంధనలు పాటించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఏఓ విజయనిర్మల ఆధ్వర్యంలో విత్తన వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో కూడిన విత్తన టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. విత్తన వ్యాపారులు అన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని, నిల్వ, విక్రయ కేంద్రాల్లో రెగ్యులర్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. సమావేశంలో ఏఓ టెక్నికల్ జి.విజ్ఞాన్, డీఎస్పీ తిరుపతిరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఎం మార్క్‌ఫెడ్ శ్యామ్, ఏడీఏలు విజయ్ చంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్