
పార్టీలో కోవర్టులకు స్థానంలేదు
తొర్రూరు రూరల్: కాంగ్రెస్ పార్టీలో కోవర్టులకు స్థానం లేదని, నిజమైన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాంచారీమడూరు గ్రామ శివారులోని రెడ్డి గార్డెన్‌లో తొర్రూరు మండల, పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని పార్టీ జిల్లా పరిశీలకురాలు రవళిరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝూన్సీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధ్యాన్యత ఇస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి అన్ని స్థానాలు గెలవడానికి కృషి చేయాలన్నారు. అనంతరం పరిశీలకురాలు రవళిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అందరూ పోటీ చేయాలని, పార్టీ కోసం నిజాయితీగా పని చేసే నాయకులు, కార్యకర్తలకు మాత్రమే కులాల వారీ గా అవకాశాలు కల్పిస్తుందన్నారు. పార్టీ పదవుల నిచామకాల్లో ఎలాంటి పైరవీలు, ఒత్తిడి ఉండదని, పార్టీ కోసం నిరంతరం పని చేసే వారికే అవకాశం దక్కుతుందన్నారు. పార్టీ బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు హమ్యానాయక్, సుంచు సంతోష్, సోమరాజశేఖర్, మండల, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే
స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం
పాలకుర్తి ఎమ్మెల్యే
మామిడాల యశస్వినిరెడ్డి