
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ మదార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డీఓలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9నుంచి 12గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కరెంట్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు సమన్వయంతో పని చేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్, ఇతర సాంకేతిక గాడ్జెట్స్‌ను ఎవరు తీసుకురాకుండా చూసే బాధ్యత సీఎస్, డీఓలదే అన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రాజకుమారి, కుమార్, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు పాల్గొన్నారు.