
హామీల అమలులో కేంద్రం విఫలం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
ఎల్కతుర్తి: హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల పదో మహాసభలకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మనుధర్మ శాస్త్ర అమలుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, మర్రి శ్రీనివాస్, కర్రె లక్ష్మణ్, సంతోశ్, రాజ్‌కుమార్, బొంత మల్లయ్య, నిమ్మల మనోహర్, ఉట్కూరి ప్రణీత్, విజయ్, రాజనర్సు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో అనాథ
వృద్ధుడి మృతి
● అంత్యక్రియల కోసం
వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు
● గంటలో రూ. 51 వేలు జమ చేసిన గ్రామస్తులు
రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన అనాథ వృద్ధుడు ఒడ్డూరి మల్ల య్య (75) వడదెబ్బతో మృతి చెందాడు. మల్లయ్య గతంలో గ్రామంలోని జెంగిడి బర్రెలకు (పాడి గేదెలు) కాపరిగా పని చేసేవాడు. కాలక్రమేణా పాడిగేదెలు తగ్గిపోవడంతో జీవనోపాధి కరువైంది. దీంతో పశువుల ఆస్పత్రి సమీపంలో డేరా వేసుకుని ఒంటరి జీవితం గడుపుతూ గ్రామస్తులు అన్నం పెడితే కడుపునింపుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బతో చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. మృతుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేయాలని తాజా మాజీ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్ ఆ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయగా గ్రామస్తులు వెనువెంటనే స్పందించారు. దాదాపు గంటలో రూ. 51 వేలు జమ చేశారు. ఆ డబ్బుతో మల్లయ్య దహన సంస్కారాలు పూర్తి చేసి దాతృత్వం చాటారు.

హామీల అమలులో కేంద్రం విఫలం