
కాంగ్రెస్‌లో కమిటీల సందడి
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కమిటీల సందడి మొదలైంది. గత అనుభవాల నేపథ్యంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. ఇందుకోసం జిల్లాకు ని యమించిన పరిశీలకులు పొట్ల నాగేశ్వర్‌రావు, రవళిరెడ్డి వారం రోజులుగా జిల్లాలో పర్యటించి కమి టీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
వారం రోజులుగా..
జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయివరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ వారం రోజులుగా సాగుతోంది. జిల్లా పరిశీలకులు పొట్ల నాగేశ్వర్‌రావు, రవళిరెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మినహా 14 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో కమిటీల నియామకం కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇలా ఆయా మండలాల్లో గ్రామ, మండల అధ్యక్షులు, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు.
గాడ్ ఫాదర్స్‌ను నమ్ముకొని..
పదవులకోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు ఎవరికి వారుగా తమకే పదవి వస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, ములుగు, ఇల్లెందు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులు, అదే విధంగా ఎంపీ పోరిక బలరాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరులు కూడా పదవులకోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు మేం కేవలం దరఖాస్తు చేసే వరకే.. అంతా మా నాయకులు చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత అనుభవాల దృష్ట్యా..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పలు మండలాల్లో రసాభాసగా మారింది. నెల్లికుదురు మండలంలో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లో పాత కార్యకర్తలను కాకుండా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు పీసీసీ వరకు వెళ్లాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి పకడ్బందీగా నియామక ప్రక్రియ ఉంటుందని జిల్లాకు వచ్చిన పరిశీలకులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి గ్రామ స్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని, పీసీసీ అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సమక్షంలో నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే పరిశీలకులు చెప్పిన విధంగా పార్టీకోసం కష్టపడిన వారికి పట్టం కడుతారా.. పైరవీలతో వచ్చిన నాయకులకు పట్టం కడుతారా అనేది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది.
గ్రామ, మండల, బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు కసరత్తు
14 మండలాలు, ఐదు పట్టణాల్లో దరఖాస్తుల స్వీకరణ
పోటీ పడి దరఖాస్తు చేసిన ఆశావహులు