
ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది
బయ్యారం: తెలంగాణలో కాంగ్రెస్ పాలిత ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని లక్ష్మీనర్సింహాపురం, రామచంద్రాపురం, కొమ్మవరం గ్రామాల్లో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులకు మంగళవారం లక్ష్మీనర్సింహాపురంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలపై రూపాయి భారం వేయకుండా వేల కోట్లతో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నామన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే బయ్యారం మండలంలో మూడు, టేకులపల్లి మండలంలో ఒక విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ముందుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో ఇల్లందు నియోజకవర్గానికి మరో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున రూ.22, 500 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, గిరిజన ప్రాంతంలో అదనంగా మరికొన్ని ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు
బయ్యారం పెద్ద చెరువు,
తులారాం ప్రాజెక్టులపై దృష్టి..
మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్దచెరువు, తులారాం ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టిసారిస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయకట్టులోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గంధంపల్లి–కొత్తపేటలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్, ఇల్లందు, మహబూబాబాద్, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, డాక్టర్ మురళీనాయక్, రాందాస్, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎస్పీ సుధీర్‌రాంనాఽథ్‌కేకన్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, విద్యుత్‌శాఖ సీఈ రాజుచౌహాన్, ఎస్‌ఈ నరేశ్, డీఈ విజయ్, ఏఈ సుమన్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో అదనంగా
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
బయ్యారం, తులారాం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మండలంలో మూడు సబ్‌స్టేషన్ల
నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది