
విద్యుత్.. కారాదు విపత్తు
హన్మకొండ: విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రధానంగా వర్షాకాలం వచ్చిందంటే తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తడిదుస్తులు ఆరేస్తూ.. మోటార్లు ఆన్ చేస్తూ.. మరమ్మతుల సమయంలో కరెంటు తీగలు పట్టుకోవడం.. తెగిన తీగల కారణంగా తరచూ విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తెగిపోయిన విద్యుత్ లైన్లు, టాన్స్‌ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో భద్రతా చర్యలు పాటించకపోవడమూ ఈప్రమాదాలకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారులను అప్రమత్తం చేయడంతోపాటు అవగాహన కల్పించడానికి ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు ‘విద్యుత్ భద్రతా వారోత్సవాలు’ నిర్వహిస్తోంది.
ప్రమాదాల నివారణకు పెద్దపీట
విద్యుత్ ప్రమాదాల నివారణకు యాజమాన్యం పెద్దపీట వేస్తోంది. జీరో విద్యుత్ ప్రమాదాలు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సర్కిల్‌లోని డీఈ టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించగా.. వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబ్బందికి అన్ని రకాల రక్షణ పరికరాలు, హెల్మెట్, గ్లోవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్‌సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, ఓల్టేజ్ డిటెక్టర్ వంటివి అందించింది.
● హనుమకొండ జిల్లాలో 4,86,266 మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 3,61,540 మంది గృహ విద్యుత్, 67,573 మంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు 74 ఉండగా.. 12,489 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది.
● వరంగల్ జిల్లాలో 4,20,925 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా.. అందులో, గృహ విద్యుత్ 2,99,091, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 70,853 ఉన్నాయి. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లు 76 ఉండగా.. 12,467 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది.
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సమస్యలు వస్తే సంబంధిత ఏఈ, సిబ్బందికి తెలియజేయాలి. ప్రతి నెలా జారీ చేసే బిల్ కమ్ నోటీస్‌పై ఏఈ, లైన్‌మెన్ ఫోన్ నంబర్ ఉంటుంది. విద్యుత్ సమస్యలు వస్తే నిపుణులైన ఎలక్ట్రీషియన్‌తో సరిచేసుకోవాలి.
– పి.మధుసూదన్ రావు,
ఎస్‌ఈ, హనుమకొండ సర్కిల్
ఉద్యోగులు భద్రతా
ప్రమాణాలు పాటించాలి..
విద్యుత్ ఉద్యోగులు భద్రతా ప్రమాణాలు పాటించాలి. రక్షణ పరికరాలు వినియోగించాలి. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు అధికారులందరి సమష్టి కృషి అవసరం. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫో న్ చేయాలి. ఈ విషయమై ప్రజలకు విసృ ్తత అవగాహన కల్పిస్తున్నాం.
– కె.గౌతంరెడ్డి, ఎస్‌ఈ, వరంగల్ సర్కిల్
ఆదమరిస్తే ప్రాణాలకే ముప్పు
నిరంతరం అప్రమత్తత
అవసరం
విద్యుత్ సమస్యలు తలెత్తితే సొంతంగా రిపేర్లు చేయొద్దు
1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి..

విద్యుత్.. కారాదు విపత్తు

విద్యుత్.. కారాదు విపత్తు