
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
సాక్షిప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు జిల్లాలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటలకు చేరుకుని సాయంత్రం 6.30 గంటల వరకు.. ఆరున్నర గంటల పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లతో కలిసి కీలక ప్రాజెక్టుల పరిశీలన, సమీక్ష చేశారు. మొదట హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌజ్‌కు చేరుకున్న మంత్రులు అక్కడ నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి.. ధర్మసాగర్ రిజర్వాయర్‌కు వెళ్లి పెండింగ్ పనులపై ఆరా తీశారు. అనంతరం భద్రకాళి చెరువును సందర్శించి పూడికతీత పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అక్కడి నుంచి హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌కు కాన్ఫరెన్స్ హాలుకు చేరుకుని ఉమ్మడి వరంగల్ కలెక్టర్‌లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ సమస్యలపై ఏకరువు...
ఉమ్మడి వరంగల్‌లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల ముందు జిల్లా మంత్రి ధనసరి సీతక్క సహా పలువురు ఎమ్మెల్యేలు కావాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలను ఏకరువు పెట్టారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో అధికంగా ఉన్న గిరిజన గ్రామాల పరిధిలో వాగులు ఉన్నందున చెక్ డ్యామ్‌లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి కాలువల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ రామచంద్రనాయక్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, కె.ఆర్.నాగరాజు, సత్యనారాయణ రావు, మురళీ నాయక్ మాట్లాడారు. తమ నియోజకవర్గాల్లోని సాగునీటి కాలువలు, చెరువులు, వాగులు, సాగునీటి ఇబ్బందులు తీర్చాలని కోరారు.
రెండు సీజన్లలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఉమ్మడి రాష్ట్రం రికార్డు బ్రేక్: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి,
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటిపారుదల శాఖ అభివద్ధి పనుల పురోగతి, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లాకు వచ్చాం. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్‌ను కూడా సందర్శించాం. దేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట తెలంగాణలో వానాకాలం, యాసంగిలో 280 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. ఎఫ్‌సీఐకి ధాన్యం విక్రయించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ము ందు వరుసలో ఉంది. రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖను బలోపేతం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు సూచించిన విధంగా సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం.
అసంపూర్తి పనులు పూర్తి..నియోజకవర్గాల
వారీగా పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇరిగేషన్‌లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, ఆగివున్న పనులన్నింటిని పూర్తి చేసి పంటకు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు అధికారులతో సమీక్షించాం. భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. 50% పనులు పూర్తి చేసినందుకు రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులకు అభినందనలు. ఇది అధికారుల పనితీరు చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, అద్వైత్ కుమార్ సింగ్, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, సాగునీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘పల్లా’ వర్సెస్ నాయిని, నాగరాజు
మంత్రులు ఉత్తమ్, పొంగులేటిల పర్యటన సందర్భంగా హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద ఇరిగేషన్ శాఖ అంతర్గత సమీక్షలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతర్గత సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది వీడియో చిత్రీకరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా.. ‘నా వ్యక్తిగత సిబ్బందితో వీడియో తీయించుకుంటే తప్పేంటి’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించడంపై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో మంత్రులు మౌనం వహించారు.
ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్‌రెడ్డి పర్యటన
ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ
ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, సుందరీకరణ పనులపై దృష్టి
దేవాదుల పంపుహౌస్, రిజర్వాయర్‌లపై రివ్యూ...
హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ
పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలపై సమీక్ష

ఆరున్నర గంటలు.. కీలక అంశాలు

ఆరున్నర గంటలు.. కీలక అంశాలు

ఆరున్నర గంటలు.. కీలక అంశాలు