మాజీ ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

మాజీ ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ

Mar 14 2025 1:27 AM | Updated on Mar 14 2025 1:27 AM

మాజీ ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ

మాజీ ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ

కేయూ విద్యా కళాశాలలో అవకతవకలు

రూ. 8 లక్షలకు పైగా మాజీ ప్రిన్సిపాల్‌ చేతివాటం

గుట్టు రట్టు కావడంతో మళ్లీ అకౌంట్‌లో జమ

షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసిన రిజిస్ట్రార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఆ కళాశాలలో రెగ్యులర్‌ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందగా ఉన్న ఒక్క రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విజయలత కొంత కాలం క్రితమే హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నియామకమైంది. దీంతో రెండున్నరేళ్ల క్రితం అదే కళాశాలలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా రెండు బాధ్యతలు అప్పగించారు. దీంతో అందొచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకున్న సదరు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ అవకతవకలకు పాల్ప డుతున్నారని కొన్నినెలల క్రితమే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించగా ఆయన మళ్లీ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలలోని బీఓ ఎస్‌ అకౌంట్‌లోని రూ. 8 లక్షలకుపైగా డబ్బును ప్రిన్సిపాల్‌, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హాంఫట్‌ చేశారనే అంశం యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది.

ఆ విద్యా కళాశాలలో

ప్రత్యేకంగా బీఓఎస్‌ అకౌంట్‌

కేయూ పరిధిలోని ఏ కాలేజీల్లో లేని విధంగా క్యాంపస్‌లోని విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌( బీఓఎస్‌) పేర బ్యాంకులో అకౌంట్‌ తీసి వినియోగిస్తున్నారనే విషయం ఇప్పుడు వెల్లడియింది. ఏ నిధులు జమచేయిస్తున్నారనే విషయంపై స్పష్టత లేకున్నా మొత్తానికి అందులో రూ. 8లక్షలకు పైగా ఉండగా ఆ డబ్బును ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వినియోగించుకున్నారని తాజాగా వెలుగు చూసింది.

మాజీ ప్రిన్సిపాల్‌ గుట్టు ఇలా రట్టు..

కేయూలో విద్యా కళాశాలలో కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను ప్రిన్సిపాల్‌ బాధ్యతల నుంచి తొలగించాక ప్రొఫెసర్‌ వి. రామచంద్రంను ఆ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా, ఇఫ్లూ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ విజయలతను విద్యా కళాశాల బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. దీంతో ఆమె ఫిబ్రవరి 1న బీఓఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీఓఎస్‌ అకౌంట్‌ గురించి ఆమె.. సదరు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను వివరాలు అడగగా తెలియజేసేందుకు జాప్యం చేశారు. దీంతో ఆమె.. వీసీ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇటీవలే కేయూ సోషల్‌ సైన్స్‌డీన్‌ మనోహర్‌ను విద్యాకళాశాలకు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించాక ఆ కళాశాలలోని పలు అవకతవకలపై ఆరాతీసినట్లు సమాచారం. బీఓఎస్‌ అకౌంట్‌లోని డబ్బులు కూడా అప్పటి బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్‌ వినియోగించుకున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో తనపై చర్యలు తీసుకుంటారని భావించిన అవతకవకలకు పాల్పడిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్‌ కొద్దిరోజుల క్రితమే తాను బీఓఎస్‌ అకౌంట్‌ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి మళ్లీ కేయూ రిజిస్ట్రార్‌ ఫండ్‌ అకౌంట్‌లోకి జమచేశారు. ఈ విషయాన్ని ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీఓఎస్‌ అకౌంట్‌ నిధులు వినియోగించుకోవాలంటే వీసీ అప్రూవల్‌ మేరకు వ్యయం చేయాల్సింటుంది. సొంతానికి వినియోగించుకోకూడదు. ఇప్పుడు వర్సిటీలో ఇది హాట్‌టాపిక్‌గామారింది.

కేయూ విద్యాకళాశాల మాజీ ప్రిన్సిపాల్‌, కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం రెండు రోజుల క్రితం షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, సదరు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వ్యవహారంపై అధికారులు విచారణ కమిటీ వేస్తారా లేదా అతడిపై చర్యలు తీసుకుంటారా అనే అంశం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ వి. రామచంద్రంను గురువారం ‘సాక్షి’ వివరణ కోరగా ఆ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బీఓఎస్‌ అకౌంట్‌ రూ. 8.50లక్షలు నుంచి తీసుకున్నారనే విషయం వెలుగు చూసిందన్నారు. రూ. 8.75లక్షలు రిజిస్ట్రార్‌ ఫండ్‌ అకౌంట్‌లోకి జమచేశారని తన దృష్టికి వచ్చిందన్నారు. రూ. 25 వేలు వడ్డీ చెల్లించానని కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చెబుతున్నారన్నారు. ఇప్పటికే షోకాజ్‌ నోటీస్‌ జారీచేశాం.. అతడు ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement