చెన్నారావుపేట: మామిడి రైతులు సరైన యాజ మాన్య చర్యలు చేపట్టినా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, పురుగులు, తెగుళ్లు ఆశించడంతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. కాయ ఎదిగే దశలో పురుగులు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చీడపీడల నివారణకు పూత ప్రారంభమైనప్పటి నుంచి కాయకోత వరకు దాదాపు 12 నుంచి 16 సార్లు పురుగు మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్కువ సార్లు అధిక గాఢత కలిగిన పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల పురుగు మందుల అవశేషాలు పండ్లలో ఉండి వాటిని తిన్న వారికి కేన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పురుగు మందుల వాడకం తగ్గించి.. నాణ్యమైన పంట చేతికి రావడానికి, అధిక ఆదాయం పొందడానికి కాయలు ఎదిగే దశలో కవర్లు తొడగాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కవర్లు తొడగడం వల్ల లాభాలు..
● కాయ ఎదిగే దశలో కవర్లు తొడగడం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల నుంచి రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా పండు.. ఈగ బారిన పడకుండా కాయలను కాపాడొచ్చు. అదే విధంగా అకాల వర్షాలతో వ్యాపించే మసి తెగులు, బ్యాక్టీరియా, మచ్చ తెగులు, పక్షి కన్ను వంటి తెగుళ్లను కూడా ఎలాంటి శిలీంద్రనాశినులు కొట్టకుండా సమర్థవంతంగా అరికట్టొచ్చు.
● కవర్లు తొడిగిన మామిడి కాయలు మంచి రంగు సంతరించుకుని ఎలాంటి మచ్చలు లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కవర్లు తొడిగితే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. రైతుకు ఖర్చు తగ్గుతుంది. పురుగు మందులు కొట్టడం తగ్గడంతో హానికర పురుగు మందుల అవశేషాలు పండులో ఉండవు. దీంతో పండు తిన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
● కవర్లు తొడగడం వల్ల పక్షుల నుంచి కలిగే నష్టాన్ని నివారించొచ్చు. కాయపెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాలతో కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టొచ్చు. కవర్లు తొడగడం వల్ల కాయలపై సొనతో ఏర్పడే మచ్చలను నివారించొచ్చు. కవర్లు తొడిగిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయి. అధిక బరువు పెరగడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. కాయలో ఉండే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్‌లో అధిక ధర వస్తుంది. రైతుకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది.
కవర్లు ఎప్పుడు తొడగాలి? ఎలా తొడగాలి?
కవర్లు ఏ దశలో తొడగాలనే అంశం చాలా ముఖ్యం. మరీ లేత దశ అంటే పిందె దశ లేదా గోళీ కాయ సైజులో తొడగొద్దు. అలా తొడిగితే కాయ కాడ లేతగా ఉండడం వల్ల కవర్ బరువు తట్టుకోలేక విరుతుంది. ఒకవేళ మరీ ఆలస్యంగా తొడిగితే అప్పటికే అన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడంతో ఆశించిన మేర నాణ్యమైన పండ్లను పొందలేం. అందుకే కాయ సుమారు 100 గ్రాములు బరువు ఉన్నప్పుడు కవర్లు తొడగాలి. అంటే పూత నుంచి సుమారు 55 నుంచి 60 రోజుల తర్వాత తొడగాలి. కవర్లు తొడిగిన 65–75 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పుడు కవర్లును తొలగించి కాయలను కోసుకోవాలి.
● మామిడి కాయలు అన్ని ఒకే దశలో ఉండవు. కవర్లపై మనం తొడిగిన తేదీలను రాసుకోవడం లేదా నంబర్లు వేసుకుంటే ముందు ఏది తొడిగామో, తొడిగిన తర్వాత ఎన్ని రోజులు అయిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవాలి. పేపర్‌తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు, బయట గాలి లోపలికి వెళ్లే అవకాశం ఉండి కాయ నాణ్యంగా ఉంటుంది.
● కాయకు కవర్ తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో తొడగొద్దు. ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లో తొడగాలి.
● కవర్లు తొడిగేటప్పుడు పురుగులు, తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకోవాలి. కవర్ తొడిగిన తర్వాత అమర్చిన వైరుతో కాడకు జాగ్రత్తగా ఎలాంటి ఖాళీ లేకుండా తొడగాలి. ఖాళీ ఉంటే పురుగులు, శిలీంద్రాలు ఈ ఖాళీ ద్వారా ప్రవేశిస్తాయి. ఒకవేళ వర్షం పడితే నీరు కూడా కాడ ద్వారా లోపలికి ప్రవేశించి కాయ పాడైపోతుంది.
ఈగ నుంచి పండుకు రక్షణ.. నాణ్యత పెంపు
చీడలు, తెగుళ్లు,
అధిక గాలుల నుంచి రక్షణ
ఎగుమతులకు అనువైన నాణ్యత.. పురుగు మందుల అవశేషాలు తక్కువ
సబ్సిడీపై కవర్ల పంపిణీ
కవర్లకు సబ్సిడీ
మొదట వరంగల్ జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మామిడిలో ప్రస్తుతం కవర్లు తొడిగి , నాణ్యమైన కాయలు అందించడానికి ఉద్యానశాఖ కవర్లకు 50 శాతం రాయితీ ఇస్తోంది. హెక్టార్‌కు(2.5 ఎకరాలు) 10, 000 కవర్లు 50 శాతం రాయితీ సదుపాయం ఉంది. ఒక రైతుకు 2 హెక్టార్లు( 5 ఎకరాలు) వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆసక్తి, ఇష్టం ఉన్న నర్సంపేట పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం రైతులు.. ఉద్యాన శాఖ అధికారులు ఎ. జ్యోతి(8977714061), వరంగల్ పరిధిలోని గీసుగొండ, సంగెం, వరంగల్ రైతులు.. ఎన్. తిరుపతి (8977714060), వర్ధన్నపేట పరిధిలోని రాయపర్తి, వర్ధన్నపేట రైతులు..ఎన్ అరుణ(8977714062), నెక్కొండ పరిధిలోని పర్వతగిరి, చెన్నారావుపేట, నెక్కొండ రైతులు.. బి. తరుణ్ (8977714053)ను సంప్రదించి వివరాలు అందించి కవర్లు తీసుకోవాలి.
సంగీత లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి
వరంగల్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు వివరాలు
జిల్లా రైతులు ఎకరాలు
వరంగల్ 2,053 6,727
హనుమకొండ 2,434 6,075
జనగామ 2,883 8,886
మహబూబాబాద్ 2,245 14,052
జయశంకర్ భూపాలపల్లి 906 1,566
ములుగు 153 454
మొత్తం 10,674 37,760
ఆదాయ వివరాలు / ఎకరాకు..
ఎకరానికి కవర్లు వాడకుండా 4.0 టన్నుల దిగుబడి వస్తుంది. ధర టన్నుకు రూ. 25,000 ఉంటుంది. ఇలా రూ. లక్ష ఆదాయం వస్తుంది.
కవర్లు తొడిగితే..
ఎకరానికి 4.25 టన్నులు దిగుబడి వస్తుంది. టన్నుకు ధర రూ. 50 వేలు ఉంటుంది. ఇలా రూ. 2,12, 500 ఆదాయం వస్తుంది.
మామిడి కాయలకు కవర్లు..
మామిడి కాయలకు కవర్లు..