మహబూబాబాద్ రూరల్: మానుకోట వ్యవసాయ మార్కెట్‌కు రోజురోజుకూ మిర్చి గణనీయంగా పెరుగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా రైతులు వాహనాల్లో మిర్చి బస్తాలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. మిర్చి రావడం పెరిగిన క్రమంలో కొనుగోళ్లు ఆలస్యం కావడం, కొంత మొత్తాన్ని ఒకరోజు మరికొంత మొత్తాన్ని మరొకరోజు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోవడంతో ఉన్నంతవరకు గురువారం కొనుగోలు జరిపి మిగిలినవి మరుసటి రోజున కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు ప్రకటించారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధికారులు శుక్రవారం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు బంద్ ఉంటాయని శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో మళ్లీ ఈనెల 10వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. గురువారం సుమారు 20 వేలకుపైగా మిర్చి బస్తాలురాగా అందులో 17,135 బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేశారు. మిర్చి బస్తాలను తీసుకువచ్చిన వాహనాలు మార్కెట్ ఆవరణలోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో వాటిని కోల్డ్ స్టోరేజీల ఎదుట నిలిపి ఉంచారు. మిర్చి బస్తాల వాహనాలు కోల్డ్ స్టోరేజీల ఎదుట బారులు దీరగా రైతులు అక్కడే అమ్ముకుని వెళ్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రైతుల రాస్తారోకో
వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ఆపవద్దంటూ గురువారం రాత్రి రైతులు రాస్తారోకో చేశారు. మిర్చి వాహనాలను మార్కెట్‌లోనికి అనుమతించి క్రయవిక్రయాలు జరపాలని రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్, టౌన్ సీఐ దేవేందర్, ఎస్సై విజయ్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వాహనాలను అనుమతించి మిర్చి కొనుగోళ్లు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేసముద్రం మార్కెట్‌లో..
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు గోస పడుతున్నారు. గురువారం అత్యధికంగా 10వేల మిర్చి బస్తాలను రైతులు తీసుకురావడంతో టెండర్‌లు ఆలస్యమయ్యాయి. రైతులు మిర్చి ఘాటుతో ఇబ్బందులు పడుతూ రాత్రంతా గడపాల్సివచ్చింది. మార్కెట్ అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంతో ఖరీదులు ఆలస్యమవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి రావడంతో శుక్రవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవు ఉండటంతో సోమవారం తిరిగి మార్కెట్‌లో క్రయవిక్రయాలు సాగుతాయన్నారు.
17,135 బస్తాల మిర్చి కొనుగోలు
నేటి నుంచి మిర్చి మార్కెట్ బంద్
కోల్డ్ స్టోరేజీల ఎదుట
బారులుదీరిన వాహనాలు
మార్కెట్ నిండా ఎర్రబంగారమే