
రామస్వామి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న సంఘం నాయకులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం నేరడ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోతుగంటి రామస్వామి (98) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కాగా, రామస్వామి పార్థివ దేహాన్ని మానుకోట మెడికల్ కళాశాలకు అప్పగించడానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో రామస్వామి తన భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు దానం చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన కుమార్తె గుండోజు జనాభాయి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ జిల్లా కన్వీనర్ పరకాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రామస్వామి పార్థివదేహాన్ని మానుకోట మెడికల్ కళాశాలకు దానం చేయడం అభినందనీయమన్నారు. కాగా, రామస్వామి పార్థివదేహానికి పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు రాపర్తి యాదగిరి, నూకల లింగారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం లీగల్ అడ్వైజర్ భువనగిరి రవీంద్ర గుప్తా, స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర ప్రతినిధి సింగు రమేష్, సమరయోధుల వారసులు చిదిరాల శరత్, మాలే హేమచందర్, జనాభాయి, కృష్ణ చైతన్య, ప్రియాంక, దూదికట్ల నవీన్, చిట్టోజు సుదర్శనా చారి, గుండోజు సరస్వతి, సుగుణ, పీఆర్.నాగేందర్ తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రామస్వామి(ఫైల్)