ఏపీ జీఓఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా యూనస్‌ అలి | - | Sakshi
Sakshi News home page

ఏపీ జీఓఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా యూనస్‌ అలి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

కర్నూలు(హాస్పిటల్‌): ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరమ్‌(ఏపీ జీఓఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చీఫ్‌ బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్న ఎండీ యూనస్‌ అలీ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. గెజిటెడ్‌ అధికారుల సేవా సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పరిపాలనా వ్యవహారాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియామకం చేసినట్లు యూనస్‌ అలి చెప్పారు. తాను నిర్వహించిన సేవా కార్యక్రమాలు, వృత్తిలో నిబద్ధత, పారదర్శకతతో తనకు ఈ పదవి లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనను వివిధ ప్రభుత్వ విభాగాల గెజిటెడ్‌ అధికారులు, సహచరులు, మిత్రులు అభినందించారు.

కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

ఓర్వకల్లు: గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి బైక్‌లు, కార్లు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా.. కాల్వ గ్రామం, బ్రాహ్మణపల్లె గ్రామాల మధ్య గల ఓ మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిఘాపెట్టిన పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకోగా ఇంకొందరు పరారైనట్లు సమాచారం. ఘటనా స్థలంలో 25 బైక్‌లు, 3 కార్లు, 4 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థావరాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు తదితర వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

మోడ్రన్‌ పెంటాథ్లాన్‌లో జిల్లాకు పతకాలు

కర్నూలు (టౌన్‌): విజయవాడలోని ఎలైట్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఈనెల 16 నుంచి 17 వర కు నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి మోడ్రన్‌ పెంటాథ్లాన్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. ఆ క్రీడా జిల్లా సంఘం కార్యదర్శి మంచికంటి అవినాష్‌ ఆదివారం క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. అండర్‌– 13లో విక్షిత, అండర్‌ 17లో లహరి, జూనియర్స్‌ విభాగంలో షేక్‌ సామియా విజేతలుగా నిలిచినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement