● ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల లైసెన్స్‌ల జారీకి పెద్ద ఎత్తున వసూళ్లు
● నమ్మకస్తులైన ఏఈవోలు, డీలర్ల ద్వారా ముడుపుల దందా
● వ్యవసాయ శాఖలో కలకలం రేపిన ఎమ్మిగనూరు ఏఈవో లంచం వ్యవహారం
● వ్యవసాయ శాఖ ద్వారా విత్తన వ్యాపారానికి ఉన్న లైసెన్స్ ఫీజు రూ.1000 మాత్రమే. ఇది కూడా చలానా రూపంలో చెల్లించాల్సి ఉంది.
● ఎమ్మిగనూరులో మాత్రం రూ.35 వేలు డిమాండ్ చేసి రూ.30 వేలకు ఒప్పందం చేసుకొని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం వ్యవసాయ శాఖలో సంచలనం సృష్టిస్తోంది.
● ఫర్టిలైజర్ వ్యాపారానికి సంబంధించి హోల్‌సేల్ లైసెన్స్‌కు రూ.9 వేలు, రిటైల్ వ్యాపారానికి లైసెన్స్ కోసం రూ.5,000 చలానా చెల్లించాల్సి ఉంది.
● రీటైల్‌కు రూ.50 వేల వరకు, హోల్‌సేల్‌కు రూ. 75 వేల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారు.
● పురుగు మందుల వ్యాపారానికి అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,500 లైసెన్స్ ఫీజు ఉంది.
● అర్బన్ ప్రాంతాల్లో రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పిండుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు సేవలందించాల్సిన వ్యవసాయ శాఖ అక్రమాలకు నిలయంగా మారుతోంది. ఎమ్మిగనూరులో ఏఈవో లంచం వ్యవహారం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. రంగన్నగౌడు అనే వ్యక్తికి సీడ్ లైసెన్స్ కోసం రెకమెండ్ చేసేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ వ్యవసాయ విస్తరణాధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాపులకు లైసెన్స్ పొందాలంటే మండలస్థాయిలో ఏవో కీలకం. ఏవో రెకమెండ్ చేస్తేనే ఏడీఏకు వెళ్తుంది. రెకమెండ్ చేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారులకు ఏ విధమైన సంబంధం లేదు. అయితే కొందరు ఏవోలు నమ్మకస్తులైన వారిని నియమించుకొని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాపుల కోసం వచ్చే దరఖాస్తుల ప్రక్రియ, ముడుపుల వ్యవహారం నడుపుతున్నారు. గత ఏడాది వ్యవసాయ అధికారుల బదిలీలు జరిగాయి. టీడీపీ నేతలకు రూ.లక్షలు ముడుపులు ఇచ్చుకొని కీలకమైన మండలాలకు కొందరు ఏవోలు పోస్టింగ్‌లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి.
రూ.20 వేల వరకు వసూలు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తమ జేబుల్లో రూ.1000 వరకు మాత్రమే ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే రికార్డుల్లో చూపాల్సి ఉంటుంది. ఎమ్మిగనూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అనధికారికంగా రూ.73,600 ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం లంచాల కింద రాబట్టినదేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా సీడ్, ఫెస్టిసైడ్ లైసెన్స్‌లు జిల్లా వ్యవసాయ అధికారి జారీ చేస్తారు. ఎరువుల వ్యాపారానికి సబ్ డివిజన్ స్థాయిలో ఏడీఏ, జిల్లా స్థాయిలో అడిషినల్ డైరెక్టర్ లైసెన్స్‌లు ఇస్తారు. ఏ లైసెన్స్ పొందాలన్నా ఏవో రెకమెండేషన్ చేయాల్సి ఉంది. కొందరు ఏవోలు లంచం కింద రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
నకి‘లీలలు’
నకిలీ పురుగుమందులు, విత్తనాలను వ్యవసాయ అధికారులు అరికట్టాల్సి ఉంది. అయితే ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. లైసెన్స్ పొందిన దుకాణాల్లో నకిలీలను ఉంచి బహిరంగంగా అమ్మకాలు సాగిస్తూ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మిగనూరు ఏవో గత ఏడాది అధికార పార్టీ నేతలకు రూ. 20 లక్షలు ముడుపులు ఇచ్చుకొని పోస్టింగ్ వేయించుకున్నారనే చర్చ వ్యవసాయశాఖలో జోరుగా సాగుతోంది. ఏవోగా వచ్చినప్పటి నుంచి ముడుపుల వేటలోనే ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.


