జగనన్న మార్టులకు ‘చంద్ర’గ్రహణం | - | Sakshi
Sakshi News home page

జగనన్న మార్టులకు ‘చంద్ర’గ్రహణం

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

ఒక మంత్రి, ఇరువురు ప్రజాప్రతినిధులు ఉన్నా ఫలితం శూన్యం

దిగజారిన స్చచ్ఛత ర్యాంకు

కనిపించని ‘స్పెషల్‌’పాలన

మూతపడిన జగనన్న మార్టులు

అధ్వానంగా స్ట్రీట్‌ మార్కెట్లు

కర్నూలు నగరంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న జగనన్న మార్టులు మూతపడ్డాయి. వీటి పేరును మహిళామార్టు అని మార్చి రెండేళ్లు అవుతున్నా తెరవలేదు. ఈ మార్టుల్లో నాణ్యమైన నిత్యావసరవస్తువులు ఎంఆర్‌పీ ధర కంటే తక్కువగా లభించేవి. మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. రిలయన్స్‌, క్రాప్టర్‌ అండ్‌ గ్యాంబల్‌ వంటి ప్రముఖ సంస్థలతో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకొని పొదుపు గ్రూపులు చేసిన వస్తువులు సైతం మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఉపయోగ పడుతున్న మహిళా మార్టుల పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. మూతపడిన పట్టించుకున్న పాపాన పోలేదు.

మూత పడిన క్రికెట్‌, టెన్నిస్‌ కోర్టులు

కర్నూలు (టౌన్‌): కర్నూలు.. ఒకప్పటి రాష్ట్ర రాజధాని. రాయలసీమ ముఖద్వారంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ నగరంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలులో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కౌన్ని సౌకర్యాలను తొలగించారు. నగర పాలకవర్గం గడువు గత మార్చి 18వ తేదీ ముగిసినా ఇప్పటి వరకు ‘స్పెషల్‌’ పాలన కనిపించడం లేదు.

మంత్రి ఉన్నా నత్తనడకన పనులు

కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్‌ రాష్ట్ర పారిశ్రామిక మంత్రిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో రెండేళ్లలో ప్రత్యేకించి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కమిషనర్లు, ఇతర విభాగాల అధికారుల బదిలీలతో పాలనలో స్తబ్ధత నెలకొంది. చేసిన పనులకు రూ. కోట్లలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు చేయడంలోనే అంతులేని జాప్యం జరుగుతుండటంతో కొంత మంది హైకోర్టు మెట్లు ఎక్కారు. అధికారులకు నోటీసులు జారీ చేయించడంతో సదరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం విజిలెన్స్‌ అస్త్రం ప్రయోగించింది. దీంతో మున్సిపల్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలో నంద్యాల చెక్‌పోస్టు నుంచి ఎస్‌ఎస్‌ గార్డెన్‌ వరకు 100 అడుగుల రోడ్డుకు స్థానిక ప్రజాప్రతినిధి అనుమతులు తీసుకువచ్చినా.. పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు

జొహరాపురంలో రూ. 2 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించింది. కర్నూలు ప్రజలకు, విద్యార్థినీ, విద్యార్థులకు, క్రీడాకారులకు, ఔత్సాహిక క్రీడాకారులకు నామమాత్రపు ఫీజులతో అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఈ క్రీడా ప్రాంగణం మూత పడింది. క్రీడాకారులు మళ్లీ ప్రైవేటు నిర్వాహకులను ఆశ్రయించాల్సి వచ్చింది. అన్ని వసతులతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియానికి మూతవేశారు.

చిరు వ్యాపారులకు ఇబ్బందులు

చిరువ్యాపారుల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కర్నూలు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో స్ట్రీట్‌ మార్కెట్లు నిర్మించింది. వినాయక్‌ ఘాట్‌, కృష్ణానగర్‌ ఐటీసీ సర్కిల్‌, గుత్తి పెట్రోల్‌ బంకు సర్కిల్‌, వాల్‌ మార్టు ఎదురుగా వ్యాపారాలు చేసుకునేందుకు ఇవి ఉన్నాయి. వీటిని మూసివేయడంతో చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బదిలీల ప్రహసనం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే కర్నూలు కమిషనర్‌ ఐఏఎస్‌ భార్గవ్‌ తేజను బదిలీ చేశారు. అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇచ్చి ఆయననూ తప్పించారు. కమిషనర్‌ రవీంద్రబాబు బాగా పనిచేస్తుండగా ఒక ప్రజాప్రతినిధికి కోపం వచ్చి ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కూడా బదిలీ వేటు పడింది. అనంతరం బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ పి. విశ్వనాథ్‌ను పట్టుమని పది నెలల గడవక ముందే బదిలీ చేశారు. పైగా పోస్టింగ్‌ ఇవ్వలేదు. వరుస బదిలీల వెనుక టీడీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అలాగే నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగంలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రాజశేఖర్‌, టౌన్‌ ప్లానింగ్‌ సిటీ ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ రెడ్డి, డాక్టర్‌ విశ్వేశ్వర రెడ్డి, డాక్టర్‌ నాగ ప్రసాద్‌ బాబు.. ఇలా వివిధ విభాగాల అధికారులను సైతం ఇష్టానుసారంగా బదిలీలు చేయడంపై పలు విమర్శలు వచ్చాయి.

దుకాణాల్లో కార్యాలయం

నగరపాలక నూతన భవనాన్ని రూ. 28 కోట్లతో నిర్మించతలపెట్టారు. ఇప్పటికే 60 శాతం పైగా పను లు పూర్తయ్యాయి. రూ. 5 కోట్ల బిల్లులు మంజూరు చేస్తే సరిపోతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పనులను నిలిపి వేసింది. చేసిన పనికి బిల్లులు మంజూరు చేయకుండా కాంట్రాక్టర్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. బిల్డింగ్‌ పనులు పూర్తి కాక నగరపాలక కార్యాలయాన్ని వెంకటరమణ కాలనీ లోని దుకాణాల్లోకి మార్చారు. దీనికి రూ. 1.50 కోట్లు ఖర్చు చేశారు.

స్వచ్ఛత.. తూచ్‌!

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్వచ్ఛతలో కర్నూలు నగరం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో క్లాప్‌ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముగ్గురు ప్రజారోగ్య ఆధికారులను మార్చడంతోపాటు క్లాప్‌ ఆటోలను రద్దు చేశారు. స్వచ్ఛత ర్యాంకు సాధించాలంటూ 200 మంది అదనపు వర్కర్లను నియమించారు. దీంతో కార్పొరేషన్‌కు ప్రతి ఏటా రూ.3.50 కోట్ల భారం పడుతోంది. క్లాప్‌ ఆటోలు లేవంటూ పది ప్రైవేటు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి నెల రూ.40 లక్షలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. అయి నా రాష్ట్ర స్థాయిలో కర్నూలు నగరం స్వచ్ఛతలో ఆరో స్థానానికి దిగజారింది.

మట్టి రోడ్డుకు రూ.50 లక్షలు

అభివృద్ధి ఎక్కడ అని ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు రూ.50 లక్షలతో 60 శాతం నిర్మించిన మట్టి రోడ్డును చూపుతున్నారు. రాజ్‌విహార్‌ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం నుంచి కల్లూరు దర్వాజ వరకు మట్టి రోడ్డు వేస్తున్నారు. హంద్రీ నదిలో వేస్తున్న మట్టి రోడ్డుకు ఇరిగేషన్‌ అధికారుల అనుమతి తీసుకోకపోవడంపై ఆరోపణలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement