ధాన్యం కొనేవారు లేరు
కల్లాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు
కూటమి ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కలేదు
ఏసీ గదుల్లో హామీలు ఇవ్వడం కాదు.. క్షేత్ర స్థాయిలో పర్యటించండి
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పాణ్యం: ‘ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేరు. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యం వద్ద పడిగాపులు కాస్తున్నా వ్యాపారులు రావడం లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆలమూరు, గోనవరం గ్రామాల్లో పర్యటించి రబీలో వరి సాగు చేసిన రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం బస్తా రూ.1,900 వరకు, రబీలో రూ.1,800 వరకు తగ్గకుండా విక్రయించారు. ఎగుమతులు లేకపోయినా ధరల స్థిరీకరణతో అప్పటి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. కొనుగోలు జరిగిన నెల రోజుల వ్యవధిలోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ధాన్యం కొనండి అని రైతులు పిలుస్తున్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కల్లాల్లో ధాన్యం ఆరబోసుకుని వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు కానీ.. యూరియాకు ధరలు మాత్రం పెంచేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో టీడీపీ నేతలు టీవీల ముందు కాకుండా రైతుల వద్దకు వచ్చి చెప్పండి. ఆనాడు ఆర్‌బీకేలను విమర్శించిన టీడీపీ నేతలు నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన విధానాలను అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు అనుకూల మీడియాలో మాట్లాడి రైతులకు ఎంతో చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పా.. రైతులకు చేసిందేమి లేదు’ అని కాటసాని విమర్శించారు.
మొక్కజొన్న సంగతేంటి..
పక్క రాష్ట్రంలో మొక్క జొన్న క్వింటాకు రూ. 2,400 మద్దతు ధర ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.1500 పలుకుతుందని కాటసాని అన్నారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత మోతాదులో కొన్నారో ప్రజలకు చెప్పాలి. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గ్రామాల్లో సంచులు ఇవ్వడం తప్ప.. ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. జొన్న, మిరప ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఉల్లి, టమాట పంటలకు ధర లేక రైతులు రోడ్లపై పారబోశారు. మామిడికి నేటికి ధర కనిపించడం లేదు’. అని చెప్పారు.
ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారు..
కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైతులకు డీజిల్ అందక పంట కోతలు కూడా ఆలస్యమయ్యాయి. ప్రజలకు గ్యాస్ సిలిండర్లు అందక ఎన్నో కష్టాలు పడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొత్త పింఛన్ల రెండేళ్లు అయినా ఇవ్వలేదు. ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. నేడు టన్ను ఇసుక ధర రూ. 900 టీడీపీ నాయకులే బహిరంగంగా అమ్ముతున్నారు. సామాన్యుడు వాగులో మట్టిని తరలిస్తున్నా తీసుకెళ్లి పోలీస్‌స్టేషనలో వేస్తున్నారు.
మద్యం డోర్ డెలివరీ
కూటమి ప్రభుత్వంలో మద్యం విక్రయాలు మాత్రం వందశాతం పక్కాగా అమలు చేస్తున్నారని కాటసాని ఎద్దేవా చేశారు. ఒక్కో గ్రామానికి 4 నుంచి 8 వరకు బెల్ట్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క ఫోన్ కాల్‌తో ఏకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్‌షాప్‌లు నిర్వహించలేదు’. అని కాటసాని అన్నారు. రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. కాటసాని వెంట మాజీ జెట్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మల్లు జయచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ రామలక్ష్మయ్య, సుమంత్‌రెడ్డి, మధురెడ్డి చాంద్‌బాషా, ఉప్పు విజయభాస్కర్, గోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


