● అధికారుల అండతోనే మట్టి దందా ● గంజిహళ్లి చెరువులో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి ● వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ చెరువును అక్రమార్కు లు కొల్లగొడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి విమర్శించారు. అనుమతులకు మించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆయన గంజిహళ్లి గ్రామ చెరువును పరిశీలించారు. తవ్వకాలను అడ్డుకుని అక్కడ ఉన్న టిప్పర్లు, యంత్రాలను బయటకు పంపించేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లాభాపేక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలన్నారు. ఇటుక బట్టీలకు చెరువు మట్టిని తరలించడం దారుణమన్నారు. అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించిన తమ పార్టీ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఇది ప్రజాసామ్వానికి విరుద్ధమన్నారు. రెండు వారాల క్రితం రాష్ట్ర కార్యదర్శి జగన్‌మోహన్ రెడ్డి చెరువును సందర్శించి అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా కాసులకు కక్కుర్తి పడి అధికార పార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. చెరువులో అక్రమ తవ్వకాలపై ఏఏ అధికారుల ప్రమేయం ఉందో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మట్టి దందాను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు బీఆర్ బసిరెడ్డి, కేవీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, గంజిహళ్లి తిరుమాలరెడ్డి, ఎస్‌బీ మన్సూర్, భాస్కర్ రెడ్డి, ఇమ్రాన్, చికెన్ రాజా, మహేష్ రెడ్డి, తోలు రాముడు, మాణిక్యరెడ్డి, డాక్టర్ శివరాం, కబేర్ నాయుడు, పులికొండ, గిడ్డయ్య, భరత్ రెడ్డి, అశోక్, లక్ష్మన్న తదితరులు ఉన్నారు.


