వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు(టౌన్): వైఎస్సార్‌సీపీ కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా నరసింహులును ఒకటవ పట్టణ పోలీసులు మర్డర్ చేసిన ముద్దాయిని తీసుకెళ్లినట్లుగా స్టేషన్‌కు తరలించడం ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు నగరంలో సతీష్ అనే దళిత యువకుడి ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించిందన్నారు. మంత్రి టీజీ భరత్ అనుచరుడు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ బెదిరింపులతోనే సతీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. ఇదే విషయాన్ని నరసింహులు సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మంత్రితో గట్టు తిలక్ సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేర్ చేయడం తప్పు ఎలాగవుతుందన్నారు. నరసింహులుపై 41 కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించడం, నాలుగు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టడం చూస్తే పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, శ్రేణులను నేరుగా ఎదుర్కోలేక టీడీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అక్రమ కేసుల ను మానుకోకపోతే న్యాయపోరాటంతో సమాధానం చెబుతామన్నారు. సతీష్ బలవన్మరణానికి కారకులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం మేల్కొనాలన్నారు.


