నేటి నుంచి లా సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లా సెమిస్టర్‌ పరీక్షలు

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 3 సంవత్సరాల లా 6వ సెమిస్టర్‌, 5 సంవత్సరాల లా 6, 8, 10 సెమిస్టర్‌ల పరీక్షలను ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెగ్యులర్‌ 316 మంది, సప్లిమెంటరీ 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. స్థానిక ఉస్మానియా డిగ్రీ కళాశాలలో ఈనెల 14వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని జేసీ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయి లో పరిష్కరించేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ఆడిటింగ్‌ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ అనురాధ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మూడు చక్రాల వాహనాలు పంపిణీ

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలోని 70 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ నూరుల్‌ ఖమర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికలో వికలాంగులకు మంజూరైన మూడు చక్రాల వాహనాలను జేసీతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల చైర్మన్‌ నారాయణస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, కూడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఎప్పటిలానే అధికారిక కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది.

క్వింటా పత్తి రూ.9615

ఆదోని అర్బన్‌: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పత్తి ధర రూ.9,615గా నమోదైంది. సోమవారం రైతులు 758 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.9,615, మధ్య ధర రూ.9,300, కనిష్ట ధర రూ.5,525 పలికింది. అదేవిధంగా వేరుశనగ 173 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,600, మధ్య ధర రూ.6,869, కనిష్ట ధర రూ.4,609 నమోదైంది. ఆముదాలు 32 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.6,056, మధ్య ధర రూ.6038, కనిష్ట ధర రూ.5,342 పలికింది.

అరటి తోట దగ్ధం

రూ.2 లక్షల ఆస్తి నష్టం

ఓర్వకల్లు: చేతికొచ్చిన అరటి తోట దగ్ధమైన బ్రాహ్మణపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన కానుగల దేవరాజు అనే రైతు తమకున్న రెండెకరాలలో గత కొంతకాలంగా అరటి పంటను సాగు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న అరటి తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుకొని సుమారు 200 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేశారు. నెల రోజుల్లో కోత కోయాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో రూ.2 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇతరులు నిప్పు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement