● లంచం తీసుకుంటుండగా
సర్వేయర్‌ను పట్టుకున్న అధికారులు
● ఫోన్‌లో డబ్బులు తీసుకురావాలని
చెప్పి దొరికిపోయిన తహసీల్దార్
బనగానపల్లె: లంచం తీసుకుంటున్న బనగానపల్లె తహసీల్దార్ ఆర్. రాజీవ్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్ సర్వేయర్ షేక్ హుస్సేన్‌బాషాను సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి బనగానపల్లె పట్టణంలోని నివాసం ఉంటున్నారు. ఇతనికి బనగానపల్లె సమీపంలో మూడు ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఇది చుక్కల భూమి కావడంతో సమస్యను తొలగించుకునేందుకు 2023లో సర్వేయర్ ద్వారా ప్రయత్నించారు. అయితే లంచం విషయంలో బేరం కుదరలేదు. దీంతో ఇన్‌చార్జ్ సర్వేయర్ షేక్‌హుస్సేన్‌బాషా ఇటీవల రైతు నారాయణరెడ్డిని మళ్లీ సంప్రదించారు. సంప్రదింపుల తరువాత తహసీల్దార్‌తో చర్చించి రూ.1.50 లక్షలకు సర్వేయర్ డిమాండ్ చేశారు. చివరకు రూ.80 వేలకు అంగీకారం కుదిరింది. ముందుగా రూ.50 వేల ఇచ్చి మిగిలినది పనిపూర్తి అయిన తర్వాత ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టంలేని రైతు నారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.50 వేల మొత్తాన్ని తీసుకునేందుకు సబ్‌స్టేషన్ వద్దకు రావాలని సర్వేయర్ కోరాడు. నారాయణరెడ్డి అక్కడికి వచ్చి సర్వేయర్‌కు డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. అక్కడి నుంచే సర్వేయర్‌తో తహసీల్దార్‌కు ఫోన్‌లో మాట్లాడించడంతో ఆయన డబ్బులు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో సర్వేయర్, తహసీల్దార్ ఇద్దరూ కలిసి రైతు నారాయణ రెడ్డి నుంచి మొత్తాన్ని తీసుకున్నట్లు తమ విచారణలో తెలినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. డీఎస్పీ వెంట సీఐలు రాజాప్రభాకర్, కృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ రాజీవ్‌రెడ్డి గత 20 రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దార్ నుంచి పదోన్నతిపై బనగానపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు.


